10, నవంబర్ 2012, శనివారం

స్నేహితుడా .. నీకు వీడుకోలు...



స్నేహితుడా.. వీడ్కోలు..

జీవితం సుఖ దు:ఖాలమయం. కష్టసుఖాల సమ్మేళనం.   
ఏది మనని అడిగి రాదు. ఏది మనకోసం ఆగదు. 
జీవితం అంటే ఈ లోకానికి కన్ను తెరచి కన్ను మూసే మధ్యలో గడిచే లిప్త కాలంపాటు నడిచేకాలం.
మనం రావడం నుంచి మనం నిష్క్రమించడం వరకూ ... ప్రపంచ రంగస్థలంపై నడిచే ఓ గొప్ప నాటకం ... 
ఈ నాటకంలో ఏ అంకం ఎప్పుడు మొదలవుతుందో .. ఎప్పుడు అంతమవుతుందో... ఎవరూహించగలరు?
అయితే జరిగే ప్రతీ ముగింపుకూడా మరో ప్రారంభమే!    

ఏమిటీ ... ఈ వేదాంతం? ఏమిటీ ... ఈ నైరాశ్యం?

అంతే! మనం ఊహించని సంఘటనలు జరిగినపుడూ... ఆ సంఘటనలు మనల్ని కదిలించివేసినప్పుడూ... మన గుండెల్లోంచి వచ్చే ఆ మాటల వెనుక ఉంటే బరువు వేదాంతమే.. ఆ మాటల్లో వినిపించేది నైరాశ్యమే...   
***
మే 31, 2012.. ఉదయాన్నే పేపరు ​​చూస్తున్నాను.    
జిల్లా పేజీ చదువుతుంటే ఓ వార్త నన్ను ఉలిక్కి పడేలా చేసింది. 
శ్రీకాకుళం జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా పనిచేస్తున్న నా మిత్రుడు పండా రాముడు హఠాత్తుగా మరణించిన వార్త అది...
తను ముందురోజే అంటే 30 తేదీనే చనిపోతే వెంటనే వాళ్ళ ఊరి తీసుకు వచ్చేసారు. 
నేను ఒక్క సారిగా షాక్ అయ్యాను. వెంటనే రవికి ఫోన్ చేసాను.తనుకూడా అప్పుడే చూసాడట. 
వెంటనే వెళ్లి చూద్దాం అనుకున్నాము కానీ... ఆరోజు భారత్ బంద్! వెళ్ళ లేక పోయాము. 
తను పోయినందుకు బాధ కొంత అయితే చివరి చూపులకు వెళ్ళలేక పోయినందుకు మరికొంత బాధ...
బరువెక్కిన గుండెతో నీలిమకి ఫోన్ చేసాను.
రాముడు చిన్నకూతురు నీలిమ .. రాముడు ఫోన్ చేసినప్పుడల్లా తనతో మాట్లాడించేవాడు. 
తనకి ఫోన్ చేసి నా సంతాపాన్ని తెలియజేశాను. పెద్ద కర్మ ఎప్పుడో చెబితే వస్తానని చెప్పాను.
ఆ తర్వాత కన్నారావు కూడా ఫోన్ చేసి మాట్లాడాడు.   
రాముడుకి ముందురోజు రాత్రి 29 న రాత్రి గుండెల్లో కొద్దిగా నొప్పి అనిపించిందట. ఏదో మందు వేసుకుని పడుకున్నాడట. ఉదయాన్నే హాస్పిటల్ కి వెళ్లాలనుకున్నారట. సుమారు 11 గంటల సమయంలో హాస్పిటల్ కి వెళ్తుంటే మళ్ళీ గుండెపోటు వచ్చిందట. హాస్పిటల్లో పరీక్ష చేస్తుండగానే ప్రాణం పోయిందట.
విషయం తెలియగానే కలెక్టరు గారూ, ఇంకా మిగిలిన జిల్లా అధికారులంతా వచ్చి భార్యాపిల్లల కోరిక మీద వెంటనే అంబులెన్స్ ఏర్పాటుచేసి వాళ్ళూరు పంపించారట. అప్పుడే తనకీ ఫోన్ చేసారట. ఈ విషయాలన్నీ కన్నారావు చెప్పాడు.     
తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత నీలిమ ఫోన్ చేసి పెద్ద కర్మ జూన్ 20 న పెద్దకర్మ వచ్చిందని చెప్పింది.
మా మిత్రులందరం ఆరోజు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. 
***
జూన్ 20 .. రానే వచ్చింది.
ముందే అందరికీ ఫోన్లు చేసాను. రవి వస్తానన్నాడు. అశోక్ అక్కడే ఉన్నాడు. భాస్కర్, పీటీవీవీ కూడా వస్తామన్నారు.
కానీ రవి టీచర్ కాబట్టి స్కూల్లో కుదరలేదు. ఉదయాన్నే ఖమ్మం నేను బయలుదేరాను. పీటీవీవీ ముందురోజు రాత్రే భద్రాచలం వచ్చేసాడు. భాస్కర్ పొద్దున్నే బయలుదేరి వస్తున్నానని చెప్పాడు. భద్రాచలం చేరాక పీటీవీవీ కి ఫోన్ చేస్తే బస్టాండ్ కి వచ్చేసాడు. భాస్కర్ రాలేదు. వస్తాడో రాడో తెలీదు. నేనూ, పీటీవీవీ ఇద్దరం మళ్ళీ బస్సెక్కాము.     
బస్సెక్కిన దగ్గర్నించీ రాముడి గురించే మాట్లాడుకున్నాం. పీటీవీవీ తనతో రాముడు మాట్లాడిన సంగతులే చెప్పాడు. వి.ఆర్.పురం వెళ్ళే వరకూ తనగురించీ వాళ్ళ పిల్లల గురించే మాట్లాడుకున్నాం.    
పెద్దమ్మాయి బిందు ఎం.సి.ఏ పూర్తి చేసింది. రెండో అమ్మాయి ప్రియాంక బి.టెక్. పూర్తి కావచ్చింది. మూడో అమ్మాయి నీలిమ ఇంటర్ చదువుతోంది. పిల్లలకి ఏ లోటూ లేకుండా చదువులైతే చెప్పించాడు గానీ, ఆస్తులైతే కూడబెట్టలేదు. 
అలా మాట్లాడుకుంటూనే వి.ఆర్.పురం వచ్చేసింది. అక్కడ అశోక్ కలిశాడు. ముగ్గురం మోటార్ సైకిళ్ళపై పెదమట్టపల్లి వెళ్ళాం. కన్నారావు అక్కడే ఉన్నాడు. మూడు రోజులైందట అక్కడికొచ్చి. రాముడు భార్యనీ, పిల్లల్ని కలిసి మా సంతాపం తెలియజేశాం.   
రాముడుకు ఈ లోకం నుండి వీడుకోలు చెప్పే తంతు పూర్తయింది. 
తిరిగి రాని లోకాలకు తరలిపోయిన స్నేహితుడా.... 
పైలోకం ​​నీ కోసం తెరచి ఉంచింది... 
స్వాగతం పలుకుతోంది... వెళ్ళిరా... నేస్తమా .. వెళ్ళిరా.. నీకిదే మా చివరి వీడుకోలు... 

*** 

మాతో చదువుకున్న వాళ్ళే కాకుండా, శ్రీకాకుళం నుండి కొందరు అధికారులు కూడా వచ్చారు. తన స్నేహితులు, తనతో కలిసి పనిచేసిన ఉద్యోగులూ, ఇంకా సన్నిహితులూ ఇతర మిత్రులూ కూడా వచ్చారు. 
నేనూ, కన్నారావూ, అశోకూ, పీటీవీవీ.. చాలాసేపు వాడిగురించే మాట్లాడుకున్నాం.
ఆ తర్వాత మా సంభాషణ మేం చదువుకున్న స్కూల్ మీదకీ, మాకు పాఠాలు చెప్పిన గురువులమీదకీ మళ్లింది. ముఖ్యంగా మా జీవితాల్లో ఎంతో మార్పు తీసుకు వచ్చిన గురువుగారు ఎర్రాప్రగడ రామ్మూర్తి గారి మీదకు మళ్లింది. ఆయన మాకు చదువులు చెప్పిన రోజులూ, పరీక్షల ముందు ఆయన ఇంటికి వెళ్లి అక్కడే చదువుకుని పడుకున్న రోజులూ గుర్తు చేసుకున్నాం.
అప్పుడే ఎలాగైనా మళ్ళీ అందరం కలుసుకోవాలి అనే విషయం మీదకి మళ్లింది. ఎప్పటినుండో వాయిదాలు పడుతూ వస్తున్న ఆ విషయం మళ్ళీ రంగం మీదకి వచ్చింది. అప్పుడే నిర్ణయించుకున్నాం... త్వరలోనే కలుసుకోవాలని... 
కన్నారావు ప్రోగ్రాం డిసైడ్ చేసేసాడు. సెప్టెంబర్ 5 .. గురుపూజోత్సవం... ఆరోజే చేసేద్దాం.. అన్నాడు.
కానీ, రవి, మా ఆవిడ టీచర్లు.. వాళ్ళు ఆరోజు స్కూల్లో తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఆ తరువాత వచ్చే ఆదివారం అంటే సెప్టెంబరు 9 నాడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాము.
ఎప్పుడో 1974 లో విడిపోయిన మా స్నేహితులందరం కలుసుకోవడం ... మా పునర్మిలనం ఖచ్చితంగా జరగాలని నిర్ణయించేసాము.
అందరికీ చెప్పాలి.. కానీ ఎవరు ఎక్కడున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో.. అందరికీ సమాచారం అందేది ఎలా?  
ఆ వివరాలను సేకరించే బాధ్యత నామీదే పెట్టారు అందరూ కలిసి.
కార్యక్రమం ఎలా నిర్వహించాలి అని కాసేపు చర్చించుకుని ఎవరిళ్ళకి వాళ్ళం బయలుదేరాం.
....
అందుకే మొదట్లో అన్నాను ..
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేము...
ఎప్పుడు ఏది ముగిసిపోతుందో..
ఎప్పుడు ఏది మొదలవుతుందో..
ఏ అంతంలో ఏ ఆరంభం ఉందో..
ఏ ముగింపు దేనికి నాంది అవుతుందో..
“ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ...”
మొత్తానికి ఒకటి స్పష్టమైంది. ఎన్నడో విడిపోయిన స్నేహితులందరం త్వరలోనే కలవబోతున్నాం. 
ఆ ఏర్పాట్లు మొదలయ్యాయి. అప్పట్నించీ ఆ కార్యక్రమం గురించే నా ఊహలూ, ఆలోచనలూ..
ఆ సన్నాహాల గురించి తర్వాత పోస్ట్ లో చెబుతాను.

2, నవంబర్ 2012, శుక్రవారం

ఎర్రాప్రగడ రామ్మూర్తి మాస్టారు



ఓసారి నాఉద్యోగంలో భాగంగా మణుగూరు సమీపంలోని పినపాక మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది.
ఆ అవకాశం రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అది కేవలం ఉద్యోగ బాధ్యత మాత్రమే కాదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం, ఉద్యోగం లోని వత్తిళ్ళ వల్ల నేను చెయ్యలేని పనీనూ. 
అది... మాకు ఎంతో ప్రీతి పాత్రమైన, నా జీవితంలో నా ఎదుగుదలకీ, నాలోని భావుకతకీ కారణమై, అంతర్లీనంగా నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన గురువుగారిని కలుసుకోబోయే అవకాశం. 
ఆయన... 
మాకు పదో తరగతిలో పాఠాలు చెప్పిన తెలుగు మేష్టారు, 'అభినవ పెద్దన' బిరుదాంకితులు ...
శ్రీ ఎర్రాప్రగడ రామ్మూర్తి గారు.  
తెలుగుమీద నాకున్న అభిమానానికీ ఆయనే కారణం. అలాగే నేను ఆంగ్ల భాషలో కొద్దోగొప్పో పట్టు లభించింది అంటే దానివెనుక కూడా కారణం ఆయనే.  అందుకే ఆయనంటే నాకెంతో అభిమానం. 
ఆయనని పదో తరగతి తర్వాత మళ్ళీ చూడలేదు. మేం  భద్రాచలంలో ఇంటర్మీడియెట్  చదివేటప్పుడు భద్రాచలంలోని చిన్న హైస్కూల్ కి బదిలీపై వచ్చినా ఆయనని కలవలేకపోయాను.  
ఆయన గురించీ, ఆయన రాసే కవిత్వం గురించీ పేపర్లో చదువుతూనే ఉన్నాను.   ఆయన రిటైర్ అయ్యాక వార్త పేపర్‌లో “తాతయ్య కబుర్లు” పేరుతో తెలుగు భాషపైనా, ఆంగ్ల భాషపైనా చాలా వ్యాసాలు రాసారు. పిల్లలకోసం తేలికైన భాషలో కళాపూర్ణోదయం లాంటి కొన్ని ప్రబంధాలు కూడా రాసారు. ఆయన గురించి చదువుతున్న ప్రతీ సారి ఆయన్ని కలవాలని అనుకుంటూనే ఉన్నాను. 
ఆయన రిటైర్ అయిన తర్వాత పినపాకలోనే ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నట్లుగా తెలిసి, ఆ ఊరికే ఆఫీసు పనిమీద వెళ్లడం నాకోసమే వచ్చిన గొప్ప అవకాశం అనిపించింది. 
ఇక్కడ ఆయన గురించి కొంత చెప్పాలి. కొంత ఏమిటి? చాలా చెప్పాలి.
ఆయన గురించి చెప్పాలి అంటే ... ఆల్-ఇన్-వన్... అని చెప్పాలి.
తెల్లగా ఆరడుగుల ఎత్తూ.., నుదుట సన్నగా పొడుగ్గా నామంతో అందంగా కనిపించే ఆయన కన్యాశుల్కం పుస్తకం అట్టమీద బొమ్మలో పంచె కట్టుకుని నోట్లో చుట్టు పెట్టుకుని ఠీవిగా నిలబడ్డ బాపు గీసిన గిరీశం బొమ్మ గుర్తొస్తుంది. ఆయన మా స్కూలుకి వచ్చిన తెలుగు మాస్టారు. మేం ఎనిమిదో తరగతి చదువుతుండగా మా స్కూలుకి వచ్చారు.   తెలుగుదనం ఉట్టిపడే చక్కని సాంప్రదాయబద్ధమైన పంచెకట్టుతో నుదుట సన్నని గీతలాంటి తిరునామంతో తెలుగు మాస్టారు అంటే ఇలా ఉండాలి అనేలా ఉండేవారు. ఒకే ఒక్క సారి మేం ఆయన్ని ఫాంటు షర్టుతో చూశాం. 
ఆయన తెలుగు పాఠాలు చెబుతుంటే వినడం మాకో గొప్ప అనుభూతి. ఆయన చెప్పే ప్రతీ పాఠం మాకో పద చిత్రం. ఆయన పాఠాలు చెబుతుంటే ఆ పాఠంలోని సన్నివేశాలు మా కళ్ళ ముందు చలన చిత్రంలాగా కదలాడుతూ ఉండేవి.   సున్నితంగా నవ్వుతూ, నవ్విస్తూ, ఉంటే ఆయన ఎవర్నీ కొట్టడం మాకు తెలీదు. కనీసం గట్టిగా కసరడం కూడా మేమెరుగం.
ఆయన పాఠాలు చెప్పే మాస్టారు మాత్రమే కాదూ, గొప్ప కవి అని, కవిత్వం కూడా బాగా రాస్తారనీ మాకు తెలిసాక మాకు ఆయనమీద గౌరవం ఇంకా పెరిగింది. ఆయన సమస్యాపూరణం లో దిట్ట అని కూడా తెలిసింది. మేం పదో తరగతి చదువుతుండగా అనుకుంటాను ఆయన రాసిన సమస్యాపూరణాలన్నీ సంకలనం చేసిన పుస్తకం ఒకటి ముద్రించారు.   అది చదివాక నాక్కూడా తెలుగు భాషమీద, తెలుగు కవిత్వం మీద అభిమానం పెరిగింది. ఆయన మాకు .. ముఖ్యంగా నాకు .. ఓ ఆదర్శమూర్తి.
పాఠాలు తరగతి చెప్పడంలో ఆయన విశ్వరూపం పదో తరగతిలో మేము చూసాము.   మేము పదో తరగతిలోకి వచ్చేసరికి మిగిలిన మేష్టార్లు అందరూ బదిలీలపై వెళ్ళిపోయారు. అప్పుడు పదో తరగతికి లెక్కలు, సైన్సూ, హిందీ, ఇంగ్లీషు పాఠాలు చెప్పడానికి ఎవరూ లేకపోవడంతో ఆయన చెప్పే తెలుగుతో పాటుగా ఆయనే అన్ని సబ్జెక్టులూ చెప్పడం మొదలు పెట్టారు.   అదే సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాయడానికి మా స్కూలుకే సెంటరు వచ్చింది.   అప్పటివరకూ ఆ స్కూల్లో చదువుకునే వాళ్ళంతా పడవ దాటి కూనవరంలో పరిక్షలు రాయాల్సి వచ్చింది.   అలాంటిది మా బడిలోనే పరీక్షలు రాసే అవకాశం మాకు రావడంతో, ఎలాగైనా మంచి ఫలితాలు రాబట్టాలనే తపనతో మాష్టారు పట్టుదలగా అన్నీ మాకు చెప్పడం మొదలు పెట్టేరు.
ఆయన పాఠం చెప్పడమే ఒక వరమైతే అన్ని క్లాసులూ ఆయనే చెప్పడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. ఆయన లెక్కలు చెప్పినా సైన్సు చెప్పినా కూడా తెలుగు పద్య భాగాలు వివరించినట్లుగానే ఉండేవి. ఇంకా ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులైతే చెప్పనే అక్కరలేదు. ఇంగ్లీషు, హిందీ చెప్పే మాస్టార్లు బదిలీపై వెళ్ళిపోతే ఆ సబ్జెక్టులు కూడా ఆయనే చెప్పారు. 
ఇంగ్లీషులో పోయిట్రీలో అది టెన్నిసన్ అయినా వర్డ్స్ వర్త్ అయినా అక్కడ మాకు కనిపించేది మా తెలుగు మాస్టారే! మా రామ్మూర్తి మాస్టారే! పోయిట్రీలో “ది బ్రూక్స్” అనే లార్డ్ టెన్నిసన్ రాసిన   పొయిమ్ ఉండేది.   దాన్ని టెన్నిసన్ ఎంత భావుకత (ఫీల్) తో రాసాడో నాకు తెలీదు గానీ రామ్మూర్తి మాస్టారి బోధనలో ఆ భావుకత .. ఆ పద్య సన్నివేశంలోకి మమ్మల్ని తీసుకెళ్లింది. మాకు – ముఖ్యంగా నాకు మాత్రం – ఆ పోయిమ్ మాస్టారు రాసిందేనేమో అనిపించేది. ఆ పాఠాలు వింటుంటే కలిగే భావుకత మిగిలిన అన్ని పరిసరాలనూ మర్చిపోయేలా చేస్తుంది. ఒక్కోసారి అప్పుడే క్లాసు అయిపోయిందా అనిపించేది.    అలా పాఠాలు చెప్పేవారు ఆయన.
ఆ తర్వాతెప్పుడో ఓసారి.. లాంచీలో రాజమండ్రీ వెళ్తుంటే మధ్యలో చాలా పెద్ద వర్షం మొదలైంది. ఆ వర్షం కురుస్తున్న సమయంలో లాంచీ పాపికొండల మధ్యలో ఉంది. ఆ వర్షం పాపికొండలపై వర్షిస్తే ఆ వర్షపునీరు పిల్ల కాలువల్లా, చిన్న చిన్న జలపాతాల కొండల మీదనుండి కిందికి జారుతూ, దూకుతూ ప్రవహిస్తూంటే ఆ దృశ్యం ఎంత అందంగా ఉంది?   ఆ సమయంలో నాకింకేమీ గుర్తుకురాలేదు. మాస్టారు వర్ణించి వివరించి చెప్పిన టెన్నిసన్ “ది బ్రూక్స్” మాత్రమే ఆ ప్రయాణమంతా గుర్తుకొచ్చింది. లాంచీదిగే దాకా “ది బ్రూక్స్” మనం చేసుకుంటూనే ఉన్నాను. మామూలు మనిషిని నాకే అంత భావుకత కలిగితే గొప్ప కవి.. ఆయనకి ఇంకెంత భావుకత కలిగి ఉంటుందోననిపించింది.  ఆ భావుకత ఉన్నందునే టెన్నిసన్ రాసిన ఆ పద్యం టెన్నిసన్ రాసిన దానికంటే   భావుకతతో, భావయుక్తంగా మాస్టారు చెప్పగలిగారు అని నాకనిపిస్తుంది. అంతలా మనసుకు హత్తుకుపోయేలా వివరించి చెప్పే వారాయన. అంతేగాదు ఏ పాఠం చెప్పినా నవరసానుభూతులను రంగరించి ఉగ్గుపాలలా మాకు అందించేవారు.
పరిక్షలు దగ్గర పడుతుండగా స్కూల్లోనే కాకుండా మమ్మల్ని ఇంటికి రమ్మని ఇంటి వద్ద కూడా పాఠాలు చెప్పడం మొదలు పెట్టేరు. స్కూల్ నించి ఇంటికి వెళ్లి, సాయంత్రం భోజనం చేసి ఏడున్నర అయ్యేసరికల్లా మేస్టారి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. చదువుకున్నంతసేపు చదువుకుని రాత్రికి అక్కడే పడుకునేవాళ్ళం. మాస్టారు మమ్మల్ని తెల్లారకుండా లేపి చదివేవారు. అంతలా శ్రద్ధ తీసుకుని చదివించే వారు కాబట్టే మా క్లాస్ లోని పన్నెండు మందిలో ఏడుగురం పాసయ్యాము. అందులో మూడు సెకండు క్లాసులు. క్లాసులో ఎప్పుడూ ఎక్కువ మార్కులు రాని నేను కూడా సెకండు క్లాసులో పాసయ్యాను. పైగా క్లాసులో రెండో స్థానం నాదే. లెక్కల్లో రవి కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అప్పటి వరకూ నాకూ తెలీదు నాక్కూడా మంచి మార్కులు వస్తాయనీ, రవి కంటేకూడా ఎక్కువ మార్కులు వస్తాయనీనూ. ఇంకా అప్పటి వరకూ హాస్టల్లో ఉండి చదువుకున్నావాళ్ళెవరూ పాస్ కాలేదు. కానీ, హాస్టల్లో ఉండి చదువుకున్న మా మిత్రులు రాముడూ, కన్నారావూ, సుబ్బారావు ముగ్గురూ పాసయ్యారు. అప్పటికి అదే రికార్డు. ఇదంతా రామ్మూర్తి మాస్టారి చలవే.     
ఇదంతా గుర్తుకువచ్చి ఎలాగైనా ఆయన్నికలుసుకోవాలని పినపాక వెళ్లాను.   ఆయన్ని గురించి మండల అడిగాను. అక్కడి వాళ్ళు వెంటనే రామాలయంలో అయ్యగారి గురించేనా అడిగేది? అని అడిగారు. నేను ఆయన కాదేమోనని కాస్త తటపటాయించాను. కానీ ఆయన గతంలో టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారని వాళ్ళు చెప్పాక ఒకసారి చూసి వద్దాం అనుకుని బయలుదేరాను.
వారిది చిన్న ఇల్లు. చుట్టూ పెరడూ, పూలమొక్కలూ.. వాతావరణం, పరిసరాలూ చాలా బాగున్నాయి. వారి ఇంటికి వెళ్ళాక మాస్టారుగారి శ్రీమతి కనిపించారు గుర్తు పట్టాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆవిడ చాలా సంతోషించారు. మాస్టారు పెరట్లో ఉన్నారు, పిలుస్తాను కూర్చోమని చెప్పి లోపలికి వెళ్లారు. ఆవిడ ఏమీ మారలేదు. అదే ఆప్యాయత, అదే అభిమానం.   మాస్టారు వచ్చారు. ఆయన్ని చూడగానే గుర్తు పట్టాను. ఆయనలో ఏమీ మార్పు లేదు. వయసువల్ల జుట్టు తెల్లబడడం లాంటివి తప్ప!   అప్పటిదాకా పడ్డ ఆదుర్దా అంతా ఆయన్ని చూడగానే క్షణంలో మటుమాయమై పోయింది. ఆయన కనబడగానే మొదట పాదాలకి నమస్కారం చేసాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను.   అప్పుడు ఆయన గుర్తుపట్టారు. ఆయన తన ఉపాధ్యాయ జీవితంలో ఎవరికో పాఠాలు చెప్పి ఉంటారు. అంతమందిలో నన్ను గుర్తు పట్టడం గొప్ప విషయమే.
నేనలా వెతుక్కుంటూ రావడం ఆయనక్కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. రవినీ, పీటీవీవీనీ, భాస్కర్ రావునీ, అశోకునీ, పండా రాముడినీ, ఇలా అందర్నీ గుర్తుకు తెచ్చుకుని పేరు పేరునా అడిగారు.   ఆయన ముఖ్యంగా కన్నయ్య అనే వాడుండాలీ అంటూ కన్నారావును గురించి అడిగారు. మొదట్లో కన్నారావు అంతబాగా చదివేవాడు కాదట. కన్నారావు వాళ్ళ నాన్నగారు మాష్టారిని కలిసి కన్నారావును ఎలాగైనా దార్లో పెట్టమని అడిగారట. దాంతో మాస్టారు ఓరోజు కన్నారావును దగ్గర కూర్చోబెట్టుకుని చదువు విలువ చెప్పి మంచిగా చదువుకోమని ఉద్బోధించారట. ఆ తర్వాతే కన్నారావులో పట్టుదల పెరిగి బాగా చదివాడట.   ఆవిషయం చెప్పి ఎలా ఉన్నాడు, ఏంచేస్తున్నాడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నేను వచ్చేస్తుంటే ఆయన రాసిన చాలా పుస్తకాలు నాకు గుర్తుగా ఇచ్చారు. మాస్టారి భార్య కూడా ఎంతో అప్యాయంగా మాట్లాడారు. ఎంతో ఆదరణ చూపారు. గుండెల నిండా మాస్టార్ని చూసిన ఆనందాన్ని నింపుకుని తిరుగు ప్రయాణం కట్టాను.
ఇంటికి తిరిగి వచ్చాక కన్నారావుకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన తననెంతగా గుర్తు పెట్టుకున్నారో చెప్పాను. తనక్కూడా ఆయన్ని చూడాలనిపిస్తుందని చెప్పాడు. ఆయనతో మాట్లాడతానని మాస్టారి ఫోన్ నెంబరు కూడా తీసుకున్నాడు. ఓసారి పినపాక వెళ్లి ఆయన్ని చూడాలని, ఆయనకీ తానెంతో ఋణపడి ఉన్నాననీ, ఆయన కోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అందరం కలిసి వెళ్తే బాగుంటుందని అనిపించింది. రాముడినీ, ఇంకా మిత్రులనీ కూడగట్టుకుని ఒక సన్మానం లాంటిది చేద్దాం అన్నాడు. ఇప్పటికే కన్నారావు ప్రభుత్వ బీమా సంస్థలో ఉన్నతాధికారి. తీరిక సమయం దొరికే ఉద్యోగం కాదది.
రాముడుతో కూడా మాట్లాడాను. అప్పుడు తను కృష్ణా జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి (CPO) గా పని చేస్తున్నాడు.  ఎప్పుడూ జిల్లా కలెక్టరుకు చేదోడు వాదోడుగా ఉంటే ఉద్యోగం తనది. క్షణం కూడా ఖాళీ లేని ఉద్యోగం... తనకీ అందర్నీ చూడాలనుందనీ, ఏర్పాట్లు చేస్తే తనుకూడా వస్తాను అన్నాడు. రవి, పీటీవీవీ, భాస్కర్రావు... అందర్నీ సంప్రదించాను. అందరూ సరేనన్నారు. కానీ సమయం, వేదిక కుదరలేదు. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. నా ఉద్యోగంలో తీరిక లేక ఎక్కడ మా సమాజం ఏర్పాటు చేయాలో ఎప్పుడు చేయాలో ఆలోచిస్తుండగానే చాలా కాలం జరిగిపోయింది. 
కానీ కాలం కలిసి రాలేదు ... అందరం కలిసే ఆ మధుర క్షణం రాలేదు.   ఎప్పటికొస్తుందో .. ఏమో...
కానీ తప్పక వస్తుందనే నమ్మకం నాకుంది... దానికోసమే ఎదురు చూస్తున్నా...

31, అక్టోబర్ 2012, బుధవారం

నేనూ నా స్నేహితులూ..



పోయినసారి   నా మిత్రుల గురించి చెప్పాను. 

మేమందరం ఓసారి కలుసుకుందామని అనుకుంటున్నట్లు, మాకు చదువు చెప్పిన గురువుల్ని సత్కరించాలని అనుకుంటున్నట్లూ చెప్పాను కదా..

మా బాచ్ లో అమ్మాయిలు తప్ప మిగిలిన అందరం ఎప్పుడో ఓసారి కలుసుకుంటూనే ఉన్నాం. కన్నారావు, రాముడూ తరచుగా ఫోన్ చేసేవాళ్ళు.   రవి ఇక్కడే ఖమ్మంలో ఉంటున్నాడు కనుక అప్పుడప్పుడూ కలుసుకుంటూనే ఉంటాం. భాస్కర్రావు చర్ల లో ఉంటాడు. ఎప్పుడైనా ఖమ్మం వస్తే నన్ను కలిసేవాడు. నేనూ అప్పుడప్పుడూ ఫోన్ చేస్తుండేవాడిని. అశోక్ వి.ఆర్.పురం లోనే ఉంటున్నాడు కనుక అక్కడికి వెళ్తే వాడూ కలిసేవాడు. ఇంక నాకు కలవని వాళ్ళు ప్రకాష్, సుబ్బారావూనూ. 

ప్రకాష్ రాజమండ్రీలో ఉంటున్నట్లు, ఆర్యాపురం కోపరేటివ్ బ్యాంకులో పనిచేస్తున్నట్లూ తెలుసు కానీ, వెళ్ళలేదు, కలవలేదు.    రాజమండ్రిలో ఎక్కడ ఉంటున్నదీ తెలియదు. నేను రాజమండ్రి వెళ్ళేదే తక్కువ. బంధువుల ఇళ్ళల్లో' పెళ్ళిళ్ళకు అటువైపు వెళ్ళినా రాజమండ్రీలో ఆగడం కుదరలేదు. కానీ ఎలాగైనా కలవాలనే కోరిక నాలో బలంగానే ఉంది. ఆమధ్య ఓసారి   కొవ్వూరులో ఓ బంధువు ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి పిలిస్తే వెళ్లాను. తిరిగి వెనక్కి రావడానికి బస్సుకి చాలా సమయం ఉందంటే నా పాత మిత్రుడిని కలవడానికి ఇదే మంచి అవకాశమని ఓసారి రాజమండ్రి వెళ్లి వస్తానని మావాళ్ళకి చెప్పి బస్సెక్కాను. రాజమండ్రిలో బస్సు దిగి ఆటోలో జాంపేట వెళ్లాను. ఆర్యాపురం కోపరేటివ్ బ్యాంక్ ఎక్కడో తెలుసుకుని అక్కడికి వెళ్లాను. ప్రకాష్ గురించి బ్యాంక్ వాచ్ మాన్ ను అడిగాను. లోపలే ఉన్నారని చెప్పాడు. ఆతృతగా లోపలికి వెళ్లి చూసాను గుర్తుపట్టగలనో లేదో అనుకుంటూ.. సీట్లో తలొంచుకుని పనిచేసుకుంటూ కూర్చున్న వ్యక్తిని చూసాను. తనేనా..కాదా? అనుకుంటూ చూస్తున్నాను. తనే! అప్పటి పోలికలు ఉన్నా చాలా మార్పు వచ్చింది. బట్ట తల వచ్చేసింది. నన్ను గుర్తుపట్టగలడా.. అనుకుంటూ తననే చూస్తూ నిల్చున్నాను. చేతిలో పని అయిపోయాక తల పైకెత్తి ఏమి కావాలన్నట్లు చూసాడు. “ప్రకాష్ మీరేనా..?” అని అడిగాను. “నేనే.. ఏంకావాలి?..” అంటూ నాకేసి చూసి ఒక్క క్షణం ఆగి పోయాడు. “మీరు.. మీరు..” అంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆగిపోయాడు. నేనెవరో చెప్పాను. అతని మోహంలో ఆశ్చర్యం తో నిండిన ఆనందం.. లోపలి పిలిచి కూర్చోబెట్టి ప్రశ్నలతో ముంచేశాడు. ఎన్నాళ్ళయిందో.. చూసి. పదో తరగతి తర్వాత ఇదే తనని చూడడం. ముప్ఫై మూడేళ్ళు అవుతోంది దాదాపుగా.. అన్ని ప్రశ్నలు వేసినా నేనొకటి గమనించాను. తనలో అప్పటి మొహమాటం, రిజర్వుడు గా ఉండే తత్వమూ ఏమీ మారలేదు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత వచ్చేశాను. భోజనానికి ఉండమన్నాడు కానీ వచ్చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం.       

నేను ఇంటర్ అయిపోయిన తర్వాత అస్సలు కలుసుకోనిది సుబ్బారావునే. ఇంటర్ అయిపోగానే రాముడూ, కన్నారావూ పై చదువుల కోసం వెళ్ళిపోయినా, సుబ్బారావు మాత్రం వాళ్ళ ఊళ్లోనే ఉండిపోయి వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉన్నారు. ఉండిపోయాడు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత భద్రాచలం బస్టాండులో కన్నారావు కలిసినప్పుడు సుబ్బారావు గురించి అడిగితే తనేదో స్వచ్చంద సంస్థలో పని చేస్తున్నట్టు చెప్పాడు.   ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత చింతూరు మండలం లో ఏదో ఐటిడిఏ స్కూల్లో పని చేస్తున్నట్లు తెలిసింది.

వీళ్ళుగాక మాతో కలిసి చదువుకున్న మరో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు పదోతరగతి వరకూ మాతో కలిసి ఆ బళ్ళో చదువుకోలేదు గానీ, ఉన్నంత వరకూ మాతో కలిసిపోయి మేము విడిపోయినా మేము మరచిపోలేని వాళ్ళు.

వాళ్ళల్లో కొంపెల్ల రామ్మూర్తి ఒకడు. డిప్యుటీ స్కూల్స్ ఇన్‌స్పెక్టర్ గారు విశ్వనాధం గారి పెద్దబ్బాయి. ఆరు ఏడు తరగతుల వరకూ మాతోనే కలిసి చదివినా ఉపనయనం కోసం వాళ్ళ ఊరు వెళ్లి అక్కడే ఉండిపోయాడు. ఓ సంవత్సరం చదువు ఆగిపోయింది. అక్కడే స్కూల్లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ మేం పదో తరగతిలోకి వచ్చాక మళ్ళీ ఇక్కడికి వచ్చి తొమ్మిదో తరగతిలో చేరాడు. కొంపెల్ల రామ్మూర్తి కాదు వాడు. కోతి రామ్మూర్తి అనేవాళ్ళు అందరూ. నిజంగా వాడు కోతే! బాగా అల్లరి చేసేవాడు.

కావూరు పాపయ్య గారు హిందీ మేష్టారు ఉండేవారు.   ఆయన తమ్ముడు గోపీకృష్ణ. ఎనిమిదో తరగతిలో మాతో కలిశాడు. తొమ్మిది వరకూ చదివి మళ్ళీ వాళ్ళ సొంతూరికి వెళ్ళిపోయాడు. చాలా చలాకీగా ఉండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు.

ఇంక నాగు. అనప్పిండి వెంకట నాగేంద్ర కుమార్ పూర్తి పేరు. మాకు స్కూల్లో హిందీ, లెక్కలు చెప్పిన శర్మ మేస్టారి తమ్ముడు.   వాళ్ళ అన్నదమ్ములందరూ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు.   ఆమాటకొస్తే వాళ్ళ కుటుంబం అంతా ఉపాధ్యాయులే. వాళ్ళ కుటుంబం గురించి మరోసారి చెప్పుకుందాం. అందర్లోకి నాగునే చిన్నవాడు. ఒకటో తరగతి నుండీ ఆరో తరగతి వరకూ మాతో కలిసి చదివాడు. బాగా చదివేవాడు. ప్రతీదానికీ అందరితో పోటీ పడేవాడు. అతని ఆఖరు అన్నయ్యకి – సుబ్బు అనేవాళ్ళం – తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం దగ్గర ఉద్యోగం చేసతుంటే అతని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండి చదువుకొన్నాడు. ఎనిమిదో తరగతిలో వచ్చి మాతో చదివాడు. మళ్ళీ తొమ్మిదో తరగతిలో వాళ్ళ అన్నయ్య దగ్గరకి వెళ్ళిపోయాడు. ఇంక ఆతర్వాత మాటతో కలవలేదు.   ఆ తర్వాత ఎప్పుడో ఆయనకీ బ్యాంకులో ఉద్యోగం వచ్చాక కలిశాడు.

నాలుగోవాడు బెహరా రామకృష్ణ.   మా తెలుగు మాస్టారు ఎర్రాప్రగడ రామ్మూర్తి గారి బంధువులబ్బాయి. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట దగ్గర వాళ్ళ ఊరు. అక్కడ అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడని ఇక్కడికి తీసుకు వచ్చారాయన. పదో తరగతిలో చేరాడు. వయసుపరంగా మాకంటే పెద్దవాడే. తెగ కబుర్లు చెప్పేవాడు. బాగా కోతలు కోసేవాడు. తన మాటల్లో ఎక్కువ సినిమా కబుర్లే ఉండేవి.   పదో తరగతి పరిక్షలు రాయకుండానే వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. కానీ మాకందరికీ బాగా గుర్తుండిపోయాడు.

వీళ్ళేగాక విశ్వేశ్వర రావు అనే మరో మిత్రుడు ఆరు ఏడు తరగతులు మాతో కలిసి చదివాడు. మాకు సాంఘికశాస్త్రం చెప్పిన డేవిడ్ మాష్టారి బంధువు. బాగా అల్లరి చేసేవాడు. ఆ తర్వాత ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మాకు తెలీలేదు.

ఇంక అమ్మాయిల విషయానికొస్తే అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడడం అంటే మాకు బెరుకు. స్కూల్లో ఉన్నప్పుడే కాస్త మాట్లాడుకోవడం. లేకపొతే అది లేదు. పదో తరగతి తర్వాత ఎవరు ఎక్కడున్నారో తెలీదు. రాజేశ్వరి మా ఊరే కాబట్టి పెళ్ళయిన సంగతి తెలుసు. పెళ్ళయిన తర్వాత తిరుపతి వెళ్ళిపోయింది. మిగిలిన ఇద్దరూ.. అమ్మాజీ, విజయలక్ష్మీ.. ఎక్కడున్నారో... ఓసారి బస్సులో అమ్మాజీ కలిసింది. కూనవరంలో బస్సెక్కింది. అవునా కాదా అంటూనే పలకరించాను. తనే.. హైదరాబాదులో ఉంటున్నట్టు చెప్పింది. వాళ్ళాయన భూగర్భజల శాఖలో పనిచేస్తున్నట్లు చెప్పింది. అంతే. ఫోన్ నెంబరు అడగడానికి మొహమాటం వేసి అడగలేదు.   ఆతర్వాత తన వివరాలు తెలియలేదు. విజయలక్ష్మిని పదో తరగతి తర్వాత అసలు చూడలేదు.. ఎక్కడుందో తెలీదు.
వీళ్ళే గాక ఇంకా రాజాగారి అమ్మాయి వెంకాయమ్మ, సుబ్బలక్ష్మీ, గొల్లకోటి విజయలక్ష్మీ   ఇంకా జ్యోత్స్న కూడా మాతో చదివారు.   వాళ్ళు ఎక్కడున్నారో ఏమో. 

గొల్లకోటి విజయలక్ష్మి.. తనుమాత్రం మధ్యలో కలిసేది. వాళ్ళ తాతగారూ, మా నాన్నగారూ మంచి స్నేహితులు. వాళ్ళ నాన్నగారు గొల్లకోటి రామకృష్ణ గారు రెవెన్యు డిపార్టుమెంటులో పని చేసేవారు.  ఆ తర్వాత తనకి పెళ్ళైపోయి తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు దగ్గర భోగాపురం వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళాయనకి  భద్రాచలం పేపర్ బోర్డులో ఉద్యోగం వచ్చింది. పేపరుబోర్డు కాలనీకి ఎప్పుడైనా వెళ్తే వీలు చూసుకుని వాళ్ళింటికి వెళ్తుండే వాడిని. ఈమధ్య వాళ్ళాయన వీఆర్ ఎస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిసింది. ఇప్పుడు ఎక్కడుందో మరి.

ఈసారి ఎలాగైనా అందరం కలుసుకోవాలి. కన్నారావుతో అన్నాను. రాముడితో కూడా అన్నాను. భాస్కర్రావుకూడా కలుసుకుందాం అన్నాడు. ఎక్కడో ఒకచోట కలుసుకోవాలి. ఎలా...

ఆ తర్వాత ఇంటర్ చదవడానికి తలోచోటికి వెళ్లిపోయాము. అప్పుడు విడిపోయాము. మళ్ళీ ఎప్పటికైనా కలుస్తామో లేదో అనుకున్నాం.

మా అమ్మాయి పెళ్ళికి అందర్నీ పిలవాలని నిర్ణయించుకున్నాను.   అందరి ఫోన్లూ సంపాదించి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి పిలిచాను. అందరికీ శుభలేఖలు పంపించాను. పెళ్ళికి కన్నారావూ, రాముడూ, పీటీవీవీ, భాస్కర్రావు, రవి, కొంపెల్ల రామ్మూర్తి వచ్చారు. అమ్మాయి పెళ్లి అనేది ఒక పండగ లా అనిపిస్తే మేమందరం కలుసుకోవడం మరో పండగలా అనిపించింది.   అందరూ మమ్మల్ని చూసి ముచ్చటపడ్డారు.   అందరం ఎక్కువసేపు మాట్లాడుకోలేక పోయినా అందరం ఒకచోట కలుసుకోవడం మాకే గాక మా బంధువులందరికీ కూడా సంతోషం కలిగించింది. 

ఈ సంతోషాన్ని మరింత పెంచు కోవాలంటే పెళ్ళిలో గాకుండా విడిగా అందరం కలుసుకోవాలి. ఎలా...
...
మనం కూడా మరోసారి కలుసుకుందాం..