హల్లో బాగున్నారా? ఈమధ్య కాస్త బద్ధకం వేసి యెవర్నీ పలకరించాలనిపించ లేదు. బద్ధకం వేస్తే పలకరించడం మానేయడం ఏంటని అడక్కండి. అదంతే! నేను ఒక్కోసారంతే! నా బద్ధకం గురించి చెప్పుకోవాలంటే బోల్డంత ఉంది. అసలు బద్ధకం గురించి చెప్పాలంటేనే బోల్డంత ఉంది. కానీ చెప్పాలంటేనే బద్ధకం వేస్తోంది. మడిసన్నాకా కూసింత కలాపోసన ఉండాలని రావు గోపాల్రావు అన్నాడు కానీ నేనైతే మడిసన్నాకా బోల్డంత బద్ధకం ఉండాలంటాను.
అసలు మానవ మనుగడ ఆంతా బద్ధకం వల్లనే అని నేనంటాను. మనిషి ఇంత డెవలప్ అయ్యాడంటే దానిక్కారణం వాడి బద్ధకమేకానీ వాడి తెలివి తేటలు కావని నా అభిప్రాయం. "నీ బోడి అభిప్రాయం యెవడిక్కావాలీ" అనకండి. నా అభిప్రాయం నాది. ఆది మానవుడు ఎలా ఉండేవాడో మనకందరికీ చరిత్రకారులు చెప్పేరు కదా, ఒంటిని కప్పుకోవాలంటే రోజూ చెట్లెక్కి ఆకులు కోసుకోవడానికి బద్ధకం వేసే కదా బట్టలు తయారు చేయడం నేర్చుకుందీ? ఆ వేళ్ళూ దుంపలూ ఈ పళ్ళూ-కాయలూ అక్కడా ఇక్కడా తిరిగి ఏరుకోవడానికి బద్ధకం వేసే కదా వ్యవసాయం మొదలెట్టిందీ? తిండి కోసం తిప్పల్లు పడ్డానికి బద్ధకం వేసే కదా రకరకాల అయుధాలూ, పనిముట్లూ తయారు చేయడం మొదలెట్టిందీ? కాదంటారా? ఇంకా బోల్డన్ని చెబుతా మీకు వినడానికి బద్ధకం వేయకపోతే! రైళ్ళూ బస్సులూ విమానాలూ ఎందుకు తయారు చేశాడూ? దూరాలు నడవడానికి బద్ధకం వేసి కాదంటారా? మెట్లెక్కడానికి బద్ధకం వేసి కాదా లిఫ్టు కనుక్కుందీ? ఈనాడు ఈ కంప్యూటర్లూ ఇంటర్నెట్లూ కనుక్కుంది ఎందుకు? తిరగడానికి బద్ధకం వేసి ఎక్కడికీ తిరక్కుండా ఉన్న చోటే కదలకుండా కూర్చుని పనులు చక్కబెట్టుకోవడానికే కదా? ఇంకో విషయం చెప్పనా? ఇది చాలా రహస్యం. అసలు అణుబాంబు ఎందుకు కనుక్కున్నారో తెలుసా? రోజురోజుకీ జనాభా బద్ధకం పెరిగిపోతుంటే అందరికీ సౌకర్యాలు చూడడనికి బద్ధకం వేసి బంతాటాడుకున్నట్టు నాలుగు అణుబాంబులు వేసుకుంటే సగమొ ముప్పాతికో గొడవ వదలిపోతుందని పాలించే ప్రభువుల ఆలోచన!!
ఎవరి మీద ఎవరు బాంబులు వేసుకుంటే నాకేం గానీ మా ఆవిడ నా మీద ఏదైనా వేసిందనుకోండి - నేను బద్ధకం వదిలించుకుని పరిగెత్తాలి. ఇందాకా ఆవిడ ఏదో చెబ్తే చెయ్యడనికి బద్ధకించా గాని, ఈ సోది మాత్రం ఇంత చెప్పేసానంటే ఆశ్చర్యపోవడానికి కూడా నాకు బద్ధకం వేస్తోంది. ఇంక ఈ బద్ధకాన్ని వదిలించుకుని ఆవిడ చెప్పింది చెయకపొతే ఆవిడ వడ్డించేవన్నీ తినాలి. ఆవిడ నాకు కావాల్సినవన్నీ వడ్డించాలంటే ఇప్పుడీ బద్ధకాన్ని వదిలించుకోవాల్సిందే! ఏంచెయ్యను? తప్పదుగా - ఇప్పటికిలా కానిచ్చి తర్వాతెప్పుడైనా మళ్ళీ కలుద్దాం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి