ఓసారి నాఉద్యోగంలో భాగంగా
మణుగూరు సమీపంలోని పినపాక మండల కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చింది.
ఆ అవకాశం రావడం నాకు ఎంతో
ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అది కేవలం ఉద్యోగ బాధ్యత మాత్రమే కాదు. ఎంతో
కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం, ఉద్యోగం లోని వత్తిళ్ళ వల్ల నేను చెయ్యలేని పనీనూ.
అది... మాకు ఎంతో ప్రీతి పాత్రమైన, నా జీవితంలో నా ఎదుగుదలకీ, నాలోని భావుకతకీ
కారణమై, అంతర్లీనంగా నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన గురువుగారిని కలుసుకోబోయే
అవకాశం.
ఆయన...
మాకు పదో తరగతిలో పాఠాలు చెప్పిన తెలుగు మేష్టారు, ‘అభినవ పెద్దన’
బిరుదాంకితులు ...
శ్రీ ఎర్రాప్రగడ రామ్మూర్తి గారు.
తెలుగుమీద నాకున్న అభిమానానికీ ఆయనే కారణం. అలాగే నేను ఆంగ్ల భాషలో
కొద్దోగొప్పో పట్టు లభించిందీ అంటే దానివెనుక కూడా కారణం ఆయనే. అందుకే ఆయనంటే నాకెంతో అభిమానం.
ఆయనని పదో తరగతి తర్వాత మళ్ళీ చూడలేదు. మేం ఇంటర్మీడియట్ చదివేటప్పుడు భద్రాచలంలోని చిన్న హైస్కూల్ కి బదిలీపై వచ్చినా ఆయనని కలవలేకపోయాను.
ఆయనని పదో తరగతి తర్వాత మళ్ళీ చూడలేదు. మేం ఇంటర్మీడియట్ చదివేటప్పుడు భద్రాచలంలోని చిన్న హైస్కూల్ కి బదిలీపై వచ్చినా ఆయనని కలవలేకపోయాను.
ఆయన గురించీ, ఆయన రాసే
కవిత్వం గురించీ పేపర్లో చదువుతూనే ఉన్నాను.
ఆయన రిటైర్ అయ్యాకా వార్త పేపర్ లో “తాతయ్య కబుర్లు” పేరుతో తెలుగు
భాషపైనా, ఆంగ్ల భాషపైనా చాలా వ్యాసాలు రాసారు. పిల్లలకోసం తేలికైన భాషలో
కళాపూర్ణోదయం లాంటి కొన్ని ప్రబంధాలు కూడా రాసారు. ఆయన గురించి చదువుతున్న ప్రతీ
సారీ ఆయన్ని కలవాలని అనుకుంటూనే ఉన్నాను.
ఆయన రిటైర్ అయిన తర్వాత పినపాకలోనే ఇల్లు
కట్టుకుని అక్కడే ఉంటున్నట్లుగా తెలిసి, ఆ ఊరికే ఆఫీసు పనిమీద వెళ్లడం నాకోసమే
వచ్చిన గొప్ప అవకాశంలా అనిపించింది.
ఇక్కడ ఆయన గురించి కొంత
చెప్పాలి. కొంతేమిటి? చాలా చెప్పాలి.
ఆయన గురించి చెప్పాలీ అంటే
... ఆల్-ఇన్-వన్... అని చెప్పాలి.
తెల్లగా ఆరడుగుల ఎత్తూ..,
నుదుట సన్నగా పొడుగ్గా నామంతో అందంగా కనిపించే ఆయన కన్యాశుల్కం పుస్తకం అట్టమీద
బొమ్మలో పంచె కట్టుకుని నోట్లో చుట్ట పెట్టుకుని ఠీవిగా నిలబడ్డ బాపు గీసిన గిరీశం
బొమ్మ గుర్తొస్తుంది. ఆయన మా స్కూలుకి వచ్చిన తెలుగు మాస్టారు. మేం ఎనిమిదో తరగతి
చదువుతుండగా మా స్కూలుకి వచ్చారు. తెలుగుదనం ఉట్టిపడే చక్కని సాంప్రదాయబద్ధమైన పంచెకట్టుతో నుదుట
సన్నని గీతలాంటి తిరునామంతో తెలుగు మాస్టారు అంటే ఇలా ఉండాలి అనేలా ఉండేవారు. ఒకే
ఒక్క సారి మేం ఆయన్ని ఫాంటు షర్టుతో చూశాం.
ఆయన తెలుగు పాఠాలు చెబుతుంటే వినడం మాకో గొప్ప అనుభూతి. ఆయన చెప్పే ప్రతీ పాఠం మాకో పద చిత్రం. ఆయన పాఠాలు చెబుతుంటే ఆ పాఠంలోని సన్నివేశాలు మా కళ్ళ ముందు చలన చిత్రంలాగా కదలాడుతూ ఉండేవి. సున్నితంగా నవ్వుతూ, నవ్విస్తూ, ఉండే ఆయన ఎవర్నీ కొట్టడం మాకు తెలీదు. కనీసం గట్టిగా కసరడం కూడా మేమేరుగం.
ఆయన తెలుగు పాఠాలు చెబుతుంటే వినడం మాకో గొప్ప అనుభూతి. ఆయన చెప్పే ప్రతీ పాఠం మాకో పద చిత్రం. ఆయన పాఠాలు చెబుతుంటే ఆ పాఠంలోని సన్నివేశాలు మా కళ్ళ ముందు చలన చిత్రంలాగా కదలాడుతూ ఉండేవి. సున్నితంగా నవ్వుతూ, నవ్విస్తూ, ఉండే ఆయన ఎవర్నీ కొట్టడం మాకు తెలీదు. కనీసం గట్టిగా కసరడం కూడా మేమేరుగం.
ఆయన పాఠాలు చెప్పే మాస్టారు మాత్రమే కాదూ,
గొప్ప కవి అనీ, కవిత్వం కూడా బాగా రాస్తారనీ మాకు తెలిసాక మాకు ఆయనమీద గౌరవం
ఇంకా పెరిగింది. ఆయన సమస్యాపూరణం లో దిట్ట
అని కూడా తెలిసింది. మేం పదో తరగతి చదువుతుండగా అనుకుంటాను ఆయన రాసిన
సమస్యాపూరణలన్నీ సంకలనం చేసిన పుస్తకం ఒకటి ముద్రించారు. అది చదివాక నాక్కూడా తెలుగు భాషమీదా, తెలుగు
కవిత్వం మీదా అభిమానం పెరిగింది. ఆయన మాకు .. ముఖ్యంగా నాకు .. ఓ ఆదర్శమూర్తి.
పాఠాలు చెప్పడంలో ఆయన
విశ్వరూపం పదో తరగతిలో మేము చూసాము. మేము
పదో తరగతిలోకి వచ్చేసరికి మిగిలిన మేష్టార్లు అందరూ బదిలీలపై వెళ్ళిపోయారు.
అప్పుడు పదో తరగతికి లెక్కలు, సైన్సూ, హిందీ, ఇంగ్లీషు పాఠాలు చెప్పడానికి వేరే
ఎవరూ లేకపోవడంతో ఆయన చెప్పే తెలుగుతో పాటుగా ఆయనే అన్ని సబ్జెక్టులూ చెప్పడం మొదలు
పెట్టారు. అదే సంవత్సరం పదో తరగతి పరిక్షలు
రాయడానికి మా స్కూలుకే సెంటరు వచ్చింది.
అప్పటివరకూ ఆ స్కూల్లో చదువుకునే వాళ్ళంతా పడవ దాటి వెళ్లి కూనవరంలో
పరిక్షలు రాయాల్సి వచ్చేది. అలాంటిది మా
బడిలోనే పరిక్షలు రాసే అవకాశం మాకు రావడంతో, ఎలాగైనా మంచి ఫలితాలు రాబట్టాలనే
తపనతో మాష్టారు పట్ట్టుదలగా అన్నీ మాకు చెప్పడం మొదలు పెట్టేరు.
ఆయన పాఠం చెప్పడమే ఒక
వరమైతే అన్ని క్లాసులూ ఆయనే చెప్పడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. ఆయన లెక్కలు
చెప్పినా సైన్సు చెప్పినా కూడా తెలుగు పద్య భాగాలు వివరించి చెప్పినట్టుగానే
ఉండేవి. ఇంకా ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులైతే చెప్పనే అక్కరలేదు. ఇంగ్లీషు, హిందీ
చెప్పే మాస్టార్లు బదిలీపై వెళ్ళిపోతే ఆ సబ్జెక్టులు కూడా ఆయనే చెప్పారు.
ఇంగ్లీషులో పోయిట్రీలో అది టెన్నిసన్ అయినా వర్డ్స్ వర్త్ అయినా అక్కడ మాకు కనిపించేది మా తెలుగు మాస్టారే! మా రామ్మూర్తి మాస్టారే! పోయిట్రీలో “ది బ్రూక్స్” అనే లార్డ్ టెన్నిసన్ రాసిన పొయిమ్ ఉండేది. దాన్ని టెన్నిసన్ ఎంత భావుకత (ఫీల్) తో రాసాడో నాకు తెలీదు గానీ రామ్మూర్తి మాస్టారి బోధనలో ఆ భావుకత .. ఆ పద్య సన్నివేశంలోకి మమ్మల్ని తీసుకుపోయేది. మాకు – ముఖ్యంగా నాకు మాత్రం – ఆ పోయిమ్ మాస్టారు రాసిందేనేమో అనిపించేది. ఆ పాఠాలు వింటుంటే కలిగే భావుకత మిగిలిన అన్ని పరిసరాలనూ మర్చిపోయేలా చేసేది. ఒక్కోసారి అప్పుడే క్లాసు అయిపోయిందా అనిపించేది. అలా పాఠాలు చెప్పేవారు ఆయన.
ఇంగ్లీషులో పోయిట్రీలో అది టెన్నిసన్ అయినా వర్డ్స్ వర్త్ అయినా అక్కడ మాకు కనిపించేది మా తెలుగు మాస్టారే! మా రామ్మూర్తి మాస్టారే! పోయిట్రీలో “ది బ్రూక్స్” అనే లార్డ్ టెన్నిసన్ రాసిన పొయిమ్ ఉండేది. దాన్ని టెన్నిసన్ ఎంత భావుకత (ఫీల్) తో రాసాడో నాకు తెలీదు గానీ రామ్మూర్తి మాస్టారి బోధనలో ఆ భావుకత .. ఆ పద్య సన్నివేశంలోకి మమ్మల్ని తీసుకుపోయేది. మాకు – ముఖ్యంగా నాకు మాత్రం – ఆ పోయిమ్ మాస్టారు రాసిందేనేమో అనిపించేది. ఆ పాఠాలు వింటుంటే కలిగే భావుకత మిగిలిన అన్ని పరిసరాలనూ మర్చిపోయేలా చేసేది. ఒక్కోసారి అప్పుడే క్లాసు అయిపోయిందా అనిపించేది. అలా పాఠాలు చెప్పేవారు ఆయన.
ఆ తర్వాతెప్పుడో ఓసారి.. లాంచీలో
రాజమండ్రీ వెళ్తుంటే మధ్యలో చాలా పెద్ద వర్షం మొదలైంది. ఆ వర్షం కురుస్తున్న
సమయంలో లాంచీ పాపికొండల మధ్యలో ఉంది. ఆ వర్షం పాపికొండలపై వర్షిస్తే ఆ వర్షపునీరు
పిల్ల కాలువల్లా, చిన్న చిన్న జలపాతాల్లా కొండల మీదనుండి కిందికి జారుతూ, దూకుతూ
ప్రవహిస్తూంటే ఆ దృశ్యం ఎంత అందంగా ఉంది?
ఆ సమయంలో నాకింకేమీ గుర్తుకురాలేదు. మాస్టారు వర్ణించి వివరించి చెప్పిన
టెన్నిసన్ “ది బ్రూక్స్” మాత్రమే ఆ ప్రయాణమంతా గుర్తుకొచ్చింది. లాంచీదిగే దాకా
“ది బ్రూక్స్” మననం చేసుకుంటూనే ఉన్నాను. మామూలు మనిషిని నాకే అంత భావుకత కలిగితే గొప్ప కవి.. ఆయనకి ఇంకెంత భావుకత
కలిగి ఉంటుందోననిపించింది. ఆ భావుకత ఉన్నందునే టెన్నిసన్ రాసిన ఆ పద్య భాగాన్ని టెన్నిసన్ రాసిన
దానికంటే భావుకతతో, భావయుక్తంగా
మాస్టారు చెప్పగలిగారు అని నాకనిపిస్తుంది. అంతలా మనసుకు హత్తుకుపోయేలా వివరించి చెప్పే
వారాయన. అంతేగాదు ఏ పాఠం చెప్పినా నవరసానుభూతులను రంగరించి ఉగ్గుపాలలా మాకు
అందించేవారు.
పరిక్షలు దగ్గర
పడుతుండగా స్కూల్లోనే కాకుండా మమ్మల్ని ఇంటికి రమ్మని ఇంటి వద్ద కూడా పాఠాలు
చెప్పడం మొదలు పెట్టేరు. స్కూల్ నించి ఇంటికి వెళ్లి, సాయంత్రం భోజనం చేసి ఏడున్నర
అయ్యేసరికల్లా మేస్టారి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. చదువుకున్నంతసేపు చదువుకుని
రాత్రికి అక్కడే పడుకునేవాళ్ళం. మాస్టారు మమ్మల్ని తెల్లారకుండా లేపి
చదివించేవారు. అంతలా శ్రద్ధ తీసుకుని చదివించే వారుకాబట్టే మా క్లాస్ లోని
పన్నెండు మందిలో ఏడుగురం పాసయ్యాము. అందులో మూడు సెకండు క్లాసులు. క్లాసులో ఎప్పుడూ ఎక్కువ మార్కులు రాని నేను
కూడా సెకండు క్లాసులో పాసయ్యాను. పైగా క్లాసులో రెండో స్థానం నాదే. లెక్కల్లో రవి
కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అప్పటి వరకూ నాకూ తెలీదు నాక్కూడా మంచి మార్కులు
వస్తాయనీ, రవి కంటేకూడా ఎక్కువ మార్కులు వస్తాయనీనూ. ఇంకా అప్పటి వరకూ హాస్టల్లో
ఉండి చదువుకున్నావాళ్ళెవరూ పాస్ కాలేదు.
కానీ, హాస్టల్లో ఉండి చదువుకున్న మా మిత్రులు రాముడూ, కన్నారావూ, సుబ్బారావు ముగ్గురూ
పాసయ్యారు. అప్పటికి అదే రికార్డు. ఇదంతా రామ్మూర్తి మాస్టారి చలవే.
ఇదంతా
గుర్తుకువచ్చి ఎలాగైనా ఆయన్నికలుసుకోవాలని పినపాక వెళ్లాను. ఆయన్ని గురించి మండల కార్యాలయంలో అడిగాను.
అక్కడి వాళ్ళు వెంటనే రామాలయంలో అయ్యగారి గురించేనా అడిగేది? అని అడిగారు. నేను ఆయన కాదేమోనని కాస్త
తటపటాయించాను. కానీ ఆయన గతంలో టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారని వాళ్ళు చెప్పాక
ఒకసారి చూసి వద్దాం అనుకుని బయలుదేరాను.
వారిది చిన్న
ఇల్లు. చుట్టూ పెరడూ, పూలమోక్కలూ.. వాతావరణం, పరిసరాలూ చాలా బాగున్నాయి. వారి
ఇంటికి వెళ్ళాక మాస్టారుగారి శ్రీమతి కనిపించారు గుర్తు పట్టాను. నన్ను నేను
పరిచయం చేసుకున్నాను. ఆవిడ చాలా సంతోషించారు. మాస్టారు పెరట్లో ఉన్నారు,
పిలుస్తాను కూర్చోమని చెప్పి లోపలి వెళ్లారు. ఆవిడ ఏమీ మారలేదు. అదే ఆప్యాయత, అదే
అభిమానం. మాస్టారు వచ్చారు. ఆయన్ని
చూడగానే గుర్తు పట్టాను. ఆయనలో ఏమీ మార్పు లేదు. వయసువల్ల జుట్టు తెల్లబడడం
లాంటివి తప్ప! అప్పటిదాకా పడ్డ ఆదుర్దా
అంతా ఆయన్ని చూడగానే క్షణంలో మటుమాయమై పోయింది. ఆయన కనబడగానే మొదట పాదాలకి
నమస్కారం చేసాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అప్పుడు ఆయన గుర్తుపట్టారు. ఆయన తన ఉపాధ్యాయ
జీవితంలో ఎందరికో పాఠాలు చెప్పి ఉంటారు. అంతమందిలో నన్ను గుర్తు పట్టడం గొప్ప
విషయమే.
నేనలా వెతుక్కుంటూ
రావడం ఆయనక్కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. రవినీ, పీటీవీవీనీ, భాస్కర్ రావునీ,
అశోకునీ, పండా రాముడినీ, ఇలా అందర్నీ గుర్తుకు తెచ్చుకుని పేరు పేరునా
అడిగారు. ఆయన ముఖ్యంగా కన్నయ్య అనే
వాడుండాలీ అంటూ కన్నారావును గురించి అడిగారు. మొదట్లో కన్నారావు అంతబాగా చదివేవాడు
కాదట. కన్నారావు వాళ్ళ నాన్నగారు మాష్టారిని కలిసి కన్నారావును ఎలాగైనా దార్లో
పెట్టమని అడిగారట. దాంతో మాస్టారు ఓరోజు కన్నారావును దగ్గర కూర్చోబెట్టుకుని చదువు
విలువ చెప్పి మంచిగా చదువుకోమని ఉద్బోధించారట. ఆ తర్వాతే కన్నారావులో పట్టుదల
పెరిగి బాగా చదివాడట. ఆవిషయం చెప్పి ఎలా
ఉన్నాడు, ఏంచేస్తున్నాడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నేను
వచ్చేస్తుంటే ఆయన రాసిన చాలా పుస్తకాలు నాకు గుర్తుగా ఇచ్చారు. మాస్టారి భార్య
కూడా ఎంతో అప్యాయంగా మాట్లాడారు. ఎంతో ఆదరణ చూపారు. గుండెల నిండా మాస్టార్ని చూసిన
ఆనందాన్ని నింపుకుని తిరుగు ప్రయాణం కట్టాను.
ఇంటికి తిరిగి
వచ్చాకా కన్నారావుకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన తననెంతగా గుర్తు పెట్టుకున్నారో
చెప్పాను. తనక్కూడా ఆయన్ని చూడాలనిపిస్తుందని చెప్పాడు. ఆయనతో మాట్లాడతానని మాస్టారి
ఫోన్ నెంబరు కూడా తీసుకున్నాడు. ఓసారి పినపాక వెళ్లి ఆయన్ని చూడాలనీ, ఆయనకీ
తానెంతో ఋణపడి ఉన్నాననీ, ఆయన కోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అందరం
కలిసి వెళ్తే బాగుంటుందని అనిపించింది. రాముడినీ, ఇంకా ఇతర మిత్రులనీ కూడగట్టుకుని
ఒక సన్మానం లాంటిది చేద్దాం అన్నాడు. అప్పటికే కన్నారావు ప్రభుత్వ బీమా సంస్థలో
ఉన్నతాధికారి. తీరిక సమయం దొరికే ఉద్యోగం కాదది.
రాముడుతో కూడా
మాట్లాడాను. అప్పుడు తను కృష్ణా జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి (CPO) గా పని చేస్తున్నాడు. ఎప్పుడూ జిల్లా
కలెక్టరుకు చేదోడు వాదోడుగా ఉండే ఉద్యోగం తనది. క్షణం కూడా ఖాళీ లేని ఉద్యోగం...
తనకీ అందర్నీ చూడాలనుందనీ, ఏర్పాట్లు చేస్తే తనుకూడా వస్తాను అన్నాడు. రవీ,
పీటీవీవీ, భాస్కర్రావు... అందర్నీ సంప్రదించాను. అందరూ సరేనన్నారు. కానీ సమయం,
వేదిక కుదరలేదు. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. నా ఉద్యోగంలోనూ తీరిక లేక ఎక్కడ మా
సమాగమం ఏర్పాటు చేయాలో ఎప్పుడు చేయాలో ఆలోచిస్తుండగానే చాలా కాలం జరిగిపోయింది.
కానీ కాలం కలిసి
రాలేదు ... అందరం కలిసే ఆ మధుర క్షణం రాలేదు.
ఎప్పటికొస్తుందో .. ఏమో...
కానీ తప్పక
వస్తుందనే నమ్మకం నాకుంది... దానికోసమే ఎదురు చూస్తున్నా...
2 కామెంట్‌లు:
Sir, very good post.I knew ram murthy garu personally.Great poet and great individual indeed.all the best.
సార్ మన గురూజీ గురించి చాలా బాగాచెప్పారండి. మృదు స్వభావి. విజ్ఞాన గని.
కామెంట్‌ను పోస్ట్ చేయండి