31, అక్టోబర్ 2012, బుధవారం

నేనూ నా స్నేహితులూ..



పోయినసారి  నా మిత్రుల గురించి చెప్పాను. 

మేమందరం ఓసారి కలుసుకుందామని అనుకుంటున్నట్లూ, మాకు చదువు చెప్పిన గురువుల్ని సత్కరించాలని అనుకుంటున్నట్లూ చెప్పాను కదా..

మా బాచ్ లో అమ్మాయిలు తప్ప మిగిలిన అందరం ఎప్పుడో ఓసారి కలుసుకుంటూనే ఉన్నాం. కన్నారావు, రాముడూ తరచుగా ఫోన్ చేసేవాళ్ళు.  రవి ఇక్కడే ఖమ్మంలో ఉంటున్నాడు కనుక అప్పుడప్పుడూ కలుసుకుంటూనే ఉంటాం. భాస్కర్రావు చర్ల లో ఉంటాడు. ఎప్పుడైనా ఖమ్మం వస్తే నన్ను కలిసేవాడు. నేనూ అప్పుడప్పుడూ ఫోన్ చేస్తుండేవాడిని. అశోక్ వి.ఆర్.పురం లోనే ఉంటున్నాడు కనుక అక్కడికి వెళ్తే వాడూ కలిసేవాడు. ఇంక నాకు కలవని వాళ్ళు ప్రకాష్, సుబ్బారావూనూ. 

ప్రకాష్ రాజమండ్రీలో ఉంటున్నట్లు, ఆర్యాపురం కోపరేటివ్ బాంకులో పనిచేస్తున్నట్లూ తెలుసు కానీ, వెళ్ళలేదు, కలవలేదు.   రాజమండ్రీలో ఎక్కడ ఉంటున్నదీ తెలియదు. నేను రాజమండ్రీ వెళ్ళేదే తక్కువ. బంధువుల ఇళ్ళల్లో’ పెళ్ళిళ్ళకు అటువైపు వెళ్ళినా రాజమండ్రీలో ఆగడం కుదరలేదు. కానీ ఎలాగైనా కలవాలనే కోరిక నాలో బలంగానే ఉంది. ఆమధ్య ఓసారి  కొవ్వూరులో ఓ బంధువు ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి పిలిస్తే వెళ్లాను. తిరిగి వెనక్కి రావడానికి బస్సుకి చాలా సమయం ఉందంటే నా పాత మిత్రుడిని కలవడానికి  ఇదే మంచి అవకాశమని ఓసారి రాజమండ్రీ వెళ్లి వస్తానని మావాళ్ళకి చెప్పి బస్సెక్కాను. రాజమండ్రీలో బస్సు దిగి ఆటోలో జాంపేట వెళ్లాను. ఆర్యాపురం కోపరేటివ్ బ్యాంక్ ఎక్కడో తెలుసుకుని అక్కడికి వెళ్లాను. ప్రకాష్ గురించి బ్యాంక్ వాచ్ మాన్ ను అడిగాను. లోపలే ఉన్నారని చెప్పాడు. ఆతృతగా లోపలికి వెళ్లి చూసాను గుర్తుపట్టగలనో లేదో అనుకుంటూ..  సీట్లో తలొంచుకుని పనిచేసుకుంటూ కూర్చున్న వ్యక్తిని చూసాను. తనేనా..కాదా? అనుకుంటూ చూస్తున్నాను. తనే! అప్పటి పోలికలు ఉన్నా చాలా మార్పు కనిపిస్తోంది. బట్ట తల వచ్చేసింది. నన్ను గుర్తుపట్టగలడా.. అనుకుంటూ తననే చూస్తూ నిల్చున్నాను.  చేతిలో పని అయిపోయాకా తల పైకెత్తి ఏమి కావాలన్నట్లు చూసాడు. “ప్రకాష్ మీరేనా..?” అని అడిగాను. “నేనే.. ఏంకావాలి?..” అంటూ నాకేసి చూసి ఒక్క క్షణం ఆగి పోయాడు. “మీరు.. మీరు..” అంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆగిపోయాడు. నేనెవరో చెప్పాను. అతని మోహంలో ఆశ్చర్యంతో కూడిన ఆనందం.. లోపలి పిలిచి కూర్చోబెట్టి ప్రశ్నలతో ముంచేశాడు. ఎన్నాళ్ళయిందో.. చూసి. పదో తరగతి తర్వాత ఇదే తనని చూడడం.  ముప్ఫై మూడేళ్ళు అవుతోంది సుమారుగా.. అన్ని ప్రశ్నలు వేసినా నేనొకటి గమనించాను. తనలో అప్పటి మొహమాటం, రిజర్వుడు గా ఉండే తత్వమూ ఏమీ మారలేదు.  కాసేపు మాట్లాడుకున్న తర్వాత వచ్చేశాను. భోజనానికి ఉండమన్నాడుకానీ వచ్చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం.

నేను ఇంటర్ అయిపోయిన తర్వాత అస్సలు కలుసుకోనిది సుబ్బారావునే. ఇంటర్ అయిపోగానే రాముడూ, కన్నారావూ పై చదువుల కోసం వెళ్ళిపోయినా, సుబ్బారావు మాత్రం వాళ్ళ ఊళ్లోనే ఉండిపోయి వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత భద్రాచలం బస్టాండులో కన్నారావు కలిసినప్పుడు సుబ్బారావు గురించి అడిగితె తనేదో స్వచ్చంద సంస్థలో పని చేస్తున్నట్లు చెప్పాడు.  ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఐటిడిఏ స్కూల్లో పని చేస్తున్నట్లుగా తెలిసింది.

వీళ్ళుగాక మాతో కలిసి చదువుకున్న మరో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు పదోతరగతి వరకూ మాతో కలిసి ఆ బళ్ళో చదువుకోలేదు గానీ, ఉన్నంత వరకూ మాతో కలిసిపోయి మేము విడిపోయినా మేము మరచిపోలేని వాళ్ళు.

వాళ్ళల్లో కొంపెల్ల రామ్మూర్తి ఒకడు. డిప్యుటీ స్కూల్స్ ఇన్స్పెక్టరు గారు విశ్వనాధం గారి పెద్దబ్బాయి. ఆరు ఏడు తరగతుల వరకూ మాతోనే కలిసి చదివినా ఉపనయనం కోసం వాళ్ళ ఊరు వెళ్లి అక్కడే ఉండిపోయాడు. ఓ సంవత్సరం చదువు ఆగిపోయింది. అక్కడే స్కూల్లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ మేం పదో తరగతిలోకి వచ్చాక మళ్ళీ ఇక్కడికి వచ్చి తొమ్మిదో తరగతిలో చేరాడు. కొంపెల్ల రామ్మూర్తి కాదు వాడు. కోతి రామ్మూర్తి అనేవాళ్ళు అందరూ. నిజంగా వాడు కోతే! బాగా అల్లరి చేసేవాడు.

కావూరు పాపయ్య గారని హిందీ మేష్టారు ఉండేవారు.  ఆయన తమ్ముడు గోపీకృష్ణ. ఎనిమిదో తరగతిలో మాతో కలిశాడు. తొమ్మిది వరకూ చదివి మళ్ళీ వాళ్ళ సొంతూరికి వెళ్ళిపోయాడు. చాలా చలాకీగా ఉండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు.

ఇంక నాగు. అనప్పిండి వెంకట నాగేంద్ర కుమార్ పూర్తి పేరు. మాకు స్కూల్లో హిందీ, లెక్కలు చెప్పిన శర్మ మేస్టారి తమ్ముడు.  వాళ్ళ అన్నదమ్ములందరూ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు.  ఆమాటకొస్తే వాళ్ళ కుటుంబం అంతా ఉపాధ్యాయులే. వాళ్ళ కుటుంబం గురించి మరోసారి చెప్పుకుందాం. అందర్లోకీ నాగూనే చిన్నవాడు. ఒకటో తరగతి నుండీ ఆరో తరగతి వరకూ మాతో కలిసి చదివాడు. బాగా చదివేవాడు. ప్రతీదానికీ అందరితో పోటీ పడేవాడు. అతని ఆఖరు అన్నయ్యకి – సుబ్బు అనేవాళ్ళం – తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం దగ్గర ఉద్యోగం వస్తే అతని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండి చదువుకొన్నాడు. ఎనిమిదో తరగతిలో వచ్చి మాతో చదివాడు. మళ్ళీ తొమ్మిదో తరగతిలో వాళ్ళ అన్నయ్య దగ్గరకి వెళ్ళిపోయాడు. ఇంక ఆతర్వాత మాతో కలవలేదు.  ఆ తర్వాత ఎప్పుడో ఆయనకీ బ్యాంకులో ఉద్యోగం వచ్చాక కలిశాడు.

నాలుగోవాడు బెహరా రామకృష్ణ.  మా తెలుగు మాస్టారు ఎర్రాప్రగడ రామ్మూర్తి గారి బంధువులబ్బాయి. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట దగ్గర వాళ్ళ ఊరు. అక్కడ అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడని ఇక్కడికి తీసుకు వచ్చారాయన. పదో తరగతిలో చేరాడు. వయసుపరంగా మాకంటే పెద్దవాడే. తెగ కబుర్లు చెప్పేవాడు. బాగా కోతలు కోసేవాడు. పదో తరగతి పరిక్షలు రాయకుండానే వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. కానీ మాకందరికీ బాగా గుర్తుండిపోయాడు.

వీళ్ళేగాక విశ్వేశ్వర రావు అనే మరో మిత్రుడు ఆరు ఏడు తరగతులు మాతో కలిసి చదివాడు. మాకు సాంఘికశాస్త్రం చెప్పిన డేవిడ్ మాష్టారి బంధువు. బాగా అల్లరి చేసేవాడు. ఆ తర్వాత ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మాకు తెలీలేదు.

ఇంక అమ్మాయిల విషయానికొస్తే అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడడం అంటే మాకు బెరుకు. ఏదో స్కూల్లో ఉన్నప్పుడే కాస్త మాట్లాడుకోవడం. లేకపొతే అదీ లేదు. పదో తరగతి తర్వాత ఎవరు ఎక్కడున్నారో తెలీదు. రాజేశ్వరి మా ఊరే కాబట్టి పెళ్ళయిన సంగతి తెలుసు. తర్వాత తిరుపతి వెళ్ళిపోయింది. మిగిలిన ఇద్దరూ.. అమ్మాజీ, విజయలక్ష్మీ.. ఎక్కడున్నారో... ఓసారి బస్సులో అమ్మాజీ కలిసింది. కూనవరంలో బస్సెక్కింది. అవునా కాదా అంటూనే పలకరించాను. తనే.. హైదరాబాదులో ఉంటున్నట్టు చెప్పింది. వాళ్ళాయన భూగర్భజల శాఖలో పనిచేస్తున్నట్లు చెప్పింది. అంతే. ఫోన్ నెంబరు అడగడానికి మొహమాటం వేసి అడగలేదు.  ఆతర్వాత తన వివరాలు తెలీలేదు. విజయలక్ష్మిని పదో తరగతి తర్వాత అసలు చూడనేలేదు.. ఎక్కడుందో తెలీదు.
వీళ్ళే గాక ఇంకా రాజాగారి అమ్మాయి వెంకాయమ్మా, ఈవో గారమ్మాయి సుబ్బలక్ష్మీ, గొల్లకోటి విజయలక్ష్మీ  ఇంకా జ్యోత్స్నా కూడా మాతో చదివారు.  వాళ్ళు ఎక్కడున్నారో ఏమో. 

గొల్లకోటి విజయలక్ష్మి.. తనుమాత్రం మధ్యలో కలిసేది. వాళ్ళ తాతగారూ, మా నాన్నగారూ మంచి స్నేహితులు. వాళ్ళ నాన్నగారు గొల్లకోటి రామకృష్ణ గారు రెవెన్యు డిపార్టుమెంటులో పని చేసేవారు.  ఆ తర్వాత తనకి పెళ్ళైపోయి తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు దగ్గర భోగాపురం వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళాయనకి  భద్రాచలం పేపర్ బోర్డులో ఉద్యోగం వచ్చింది. పేపరుబోర్డు కాలనీకి ఎప్పుడైనా వెళ్తే వీలు చూసుకుని వాళ్ళింటికి వెళ్తుండే వాడిని. ఈమధ్య వాళ్ళాయన వీ ఆర్ ఎస్ తీసుకుని ఇక్కడినుండి వెళ్లిపోయాడని తెలిసింది. ఇప్పుడు ఎక్కడుందో మరి.

ఈసారి ఎలాగైనా అందరం కలుసుకోవాలి. కన్నారావుతో అన్నాను. రాముడితో కూడా అన్నాను. భాస్కర్రావుకూడా కలుసుకుందాం అన్నాడు. ఎక్కడో ఒకచోట కలుసుకోవాలి. ఎలా...
ఆ తర్వాత ఇంటర్ చదవడానికి తలోచోటికీ వెళ్లిపోయాము. అప్పుడు విడిపోయాము. మళ్ళీ ఎప్పటికైనా కలుస్తామో లేదో అనుకున్నాం.

మా అమ్మాయి పెళ్ళికి అందర్నీ పిలవాలని నిర్ణయించుకున్నాను.  అందరి ఫోన్లూ సంపాదించి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి పిలిచాను. అందరికీ శుభలేఖలు పంపించాను. పెళ్ళికి కన్నారావూ, రాముడూ, పీటీవీవీ, భాస్కర్రావూ, రవీ, కొంపెల్ల రామ్మూర్తీ వచ్చారు. అమ్మాయి పెళ్లి అనేది ఒక పండగ లా అనిపిస్తే మేమందరం కలుసుకోవడం మరో పండగలా అనిపించింది.  అందరూ మమ్మల్ని చూసి ముచ్చట పడ్డారు.  అందరం ఎక్కువసేపు మాట్లాడుకోలేక పోయినా అందరం ఒకచోట కలుసుకోవడం మాకే గాక మా బంధువులందరికీ కూడా సంతోషం కలిగించింది. 
ఈ సంతోషాన్ని మరింత పెంచు కోవాలంటే పెళ్ళిలో గాకుండా విడిగా అందరం కలుసుకోవాలి.  ఎలా...
...
మనం కూడా మరోసారి కలుసుకుందాం..

27, అక్టోబర్ 2012, శనివారం

మా ఊరూ, మా బడీ..



మా ఊరు...
చిన్నప్పుడు నేను పెరిగిన ఊరు...
నా బాల్యంలో నాకెన్నో అనుభూతులు మిగిల్చిన ఊరు...
నాకు చదువు చెప్పిన ఊరు...
నాకు సుద్దులూ, బుద్ధులూ చెప్పిన ఊరు...
నేను పెద్దయ్యి చదువూ, ఉద్యోగం నిమిత్తం బయటికి వచ్చేసినా...
నా చిన్నప్పటి జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుని మిగిలిపోయిన ఊరు...
తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించి పోతుంది.

ఆనాటి ఆ జ్ఞాపకాలు చిన్నప్పటి ఆ తీపి గురుతులూ నా జీవితంలో ఎన్నో సందర్భాలలో ఎన్నో సార్లు నేను గుర్తుకు తెచ్చుకుని ఎంతో ఆనందాన్నీ, స్పూర్తినీ పొందాను.  ఆనాడు నాకు చదువు చెప్పిన మాస్టార్లు, వాళ్ళు చేసిన మార్గ దర్శకత్వం నా తరవాతి జీవితంలో నాకెంతో ఉపయోగపడ్డాయని చెబితే అది అతిశయోక్తి కాదు.  అవెలా ఉపయోగపడ్డాయో తరవాత చెబుతాను. ఉపయోగపడ్డాయని చెప్పడం మాత్రం చాలా చాలా నిజం. అంతే కాదు.  ఆనాడు నాతో కలిసి చదువుకున్న, నాతో కలిసి తిరిగిన నా చిన్ననాటి స్నేహితులూ నా ఇరుగుపొరుగువారితో నా పరిచయం, వారితో నాకున్న సాన్నిహిత్యమూ  ఇంకా ఆ పరిసరాలు కూడా నాపై ఎంతో ప్రభావం చూపాయి. ఆ ప్రభావం ఎంతో తర్వాత్తర్వాత మీకే అర్ధమవుతుంది.

నాకు ఎన్నో ఎన్నెన్నో అనుభవాలనీ, అనుభూతుల్నీ, స్నేహితుల్నీ, ఇచ్చి నన్ను ఎంతో ప్రభావితం చేసిన గురువులని ప్రసాదించింది మా ఊరి బడి.
ఆ ఊరు వరరామచంద్రపురం. ఆ బడి జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్. 

ఖమ్మం జిల్లాలోని  భద్రాచలం తాలూకాలో ఒక మారుమూల ప్రాంతం వరరామచంద్రపురం మండలం.  ప్రస్తుతం దాన్నే మండల కేంద్రం గా మార్చారు. అక్కడికి ఒక కిలోమీటరు దూరంలోనే రేకపల్లి. అదే మా సొంతూరు. మా ఊరికి తూర్పు వైపు, ఉత్తరం వైపూ అంతా దట్టమైన అటవీ ప్రాంతమే. పడమటి వైపు శబరీ, దక్షిణం వైపు గోదావరీ సుమారు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవాహం ఇప్పటిది కాదు. కానీ ఎప్పటికప్పుడు పాతని వదిలించుకుని ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అదే కదా ఈ నదుల్లోని గొప్పదనం. నిలిచి ఉండేనీరు నాచుతో నిండి ఉంటుంది. ప్రవహించే నీరు ఎప్పుడూ స్వచ్చంగానే ఉంటుంది కదా?
తూర్పున వాలి సుగ్రీవుల కొండలని రెండు కొండలు ఉన్నాయి. అవి నిజంగానేవాలి సుగ్రీవుల్లాగానే అనిపిస్తాయి. ఆకాశానికి రొమ్ము ఎదురొడ్డి ఠీవిగా నిటారుగా నిలిచి ఉండే కొండ ఒకటి. దాన్నే వాలి కొండ అంటారు... దానికి దాసోహం అంటున్నట్టుగా దాని చెంత మోకరిల్లి నట్లుండే కొండ ఇంకోటి. దాన్ని సుగ్రీవ కొండ అంటారు. ఆ రెండు కొండల మధ్యన వారధిలా ఉండే కొండపై ఒక రామాలయం ఉంది. ఆ కొండ పాదాలచెంత ఊరే శ్రీరామగిరి. వాటిని చూస్తుంటే ఆనాటి శ్రీరాముడు అక్కడే నివసించాడనే ఆ ప్రాంత వాసుల నమ్మకం నిజమేనేమో అనిపిస్తుంటుంది. ఆ ఊరి గురించి మరోసారి చెప్పుకుందాం.

ఇంక.. మా ఊరి విషయానికి వచ్చేద్దాం...

అప్పట్లో మా ఊరికి రావాలంటే మామూలు నాటు పడవలమీద శబరి గానీ, గోదావరి గానీ  దాటి రావాల్సిందే. కిరాయికి ఆటోలు గానీ, రిక్షాలుగానీ ఉండేవి గావు. అంతా కాలి నడకే. అసలు ఆ ప్రాంతంలోని ఏ ఊరికి వెళ్ళడమన్నా ఓ గొప్ప ప్రహసనమే. మా ఊరికి వచ్చే అధికార్లు కూడా వారి జీపులూ, వాహనాలూ పడవల్లో నది దాటించి వచ్చేవారు. వర్షాకాలమైతే ఆ బాధలు వర్ణనాతీతమే! కొన్ని కొన్ని ఊళ్ళకి వెళ్ళాలంటే మోకాలి లోతు నీళ్ళల్లో కొన్ని సందర్బాల్లో నడుం లోతు నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్లాల్సిందే.

చిన్నతనంలో మాకు తెలిసిన మోటారు వాహనం అంటే అధికార్లు వేసుకు వచ్చే జీపే. దుమ్ము రేపుకుంటూ జీపు వస్తే దానివెనక కొంతదూరం పరుగులు పెట్టే వాళ్ళం. ఎక్కడైనా జీపు ఆపి కనబడితే దానిదగ్గరకి వెళ్లి దానిచుట్టూ తిరుగుతూ దాని పొగ వాసన పీలుస్తూ ఆనంద పడే వాళ్ళం.  మాకు తెలిసిన రవాణా వాహనం అంటే కూనవరం నుండి రాజమండ్రి వరకూ నడిచే లాంచీనే. అప్పుడప్పుడూ లారీలు వచ్చేవి.  ఆ తర్వాత ఒకటి రెండు ట్రాక్టర్లు తిరిగేవి. డిసెంబరు నెలనుండి బేరన్ పుగాకు క్యూరింగ్ కోసం బెరన్లకు కట్టెలు తేవడానికి కొన్ని లారీలూ, ట్రాక్టర్లూ వచ్చేవి. మోటార్ సైకిళ్ళు కూడా ఎక్కువ ఉండేవి కావు. ఎక్కడైనా అవి ఆగి ఉంటే ఒకసారి ఎక్కి ఆనందించే వాళ్ళం. అలా ఎక్కడంలో కింద పడ్డాలూ, ఎక్కుతుంటే ఆ వాహనాల డ్రైవర్లు అరుస్తుంటే ఎక్కడివాళ్ళక్కడ చెల్లాచెదురై పారిపోవడాలూ ఇప్పటికింకా నా కళ్ళముందు కదలాడుతూనే ఉంటాయి.

అలాంటి ఊరికి ఎక్కడి నించో వచ్చి మాకు పాఠాలు  చెప్పిన మాస్టార్లు అంటే మాకు భయంతో కూడిన అభిమానం, ఇంకా ఎంతో గౌరవం కూడానూ. వాళ్ళను చూస్తుంటే మాకు భయం కంటే కూడా ఎంతో గౌరవ భావం కలుగుతుండేది.  అప్పట్లో ఈ ప్రాంతానికి ఉద్యోగానికి రావడం అంటే ఒకరకంగా సాహసం లాంటిదే. బంధువులందరికీ దూరంగా ఉంటూ వాళ్ళున్న ప్రాంతాన్నే వారి స్వంతం చేసుకుని ఆ ప్రాంతం వాళ్లనే స్వంతవాళ్ళు గా భావించి వారికి తెలిసిన విద్యను మాలాంటి వాళ్ళకు నేర్పించి మమ్మల్ని ప్రయోజకులను చేసిన మాస్టార్లకి ఏంచేస్తే ఋణం తీరుతుంది? 

అందుకే అప్పట్లో చదువు కున్న పాత విద్యార్ధులం అందరం కలుసుకుని మాకు చదువు చెప్పిన గురువుల్ని సత్కరించుకునే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నాం.  మేం పదవ తరగతి చదివేటప్పుడు అంటే 1973-74 సంవత్సరంలో మా క్లాసులో 16 మందే ఉండే వాళ్ళం.  అందులో ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు.

మా క్లాస్ మేట్లు ఒక్కొక్కళ్ళూ ఒకోరకం. నేను అందర్లోకీ పొట్టిగా ఉండేవాడిని. అందుకని నన్నంతా పొట్టోడు అనేవాళ్ళు. నాకు ఏడుపు వచ్చేది. దాన్ని చూసి పొట్టి బుడంకాయ్ అంటూ నన్ను ఇంకా ఉడికించేవాళ్ళు. అయినా అందర్లోకీ నేనే యాక్టివ్ గా ఉండే వాణ్ని. మా నాన్న ప్రతీరోజూ రాత్రి పడుకునేముందు మాకు కధలు చెప్పేవాళ్ళు. ఆ కధల్లో కల్పితాల కంటే ఎక్కువ పురాణాలూ, చరిత్ర, దేశభక్తీ, భూగోళం, సైన్స్ .. ఇలా అన్ని విషయాలూ ఉండేవి. అవన్నీ మా పాఠాలలో ఉండేవే. అందువల్ల మా మాస్టార్లు మాకు పాఠాలు చెప్పేటప్పుడు ఏమైనా ప్రశ్నలు వేస్తే నాకు వెంటనే మా నాన్న చెప్పిన కధల్లోని విషయాలు గుర్తుకు వచ్చేవి. నేను వెంటనే చెప్పేసే వాడిని. అందుకని నన్ను ఈ పొట్టోడికి జనరల్ నాలేడ్జీ ఎక్కువే  అనేవాళ్ళు. అలా అని నేనేం ఫస్ట్ క్లాస్ స్టుడెంట్ ని కాను. ఎప్పుడూ తప్ప లేదు కానీ, మార్కులు ఎక్కువ వచ్చేవి కావు.

నేనూ, నాతోపాటు మావూరి కరణం గారబ్బాయి రవి .. నా క్లాస్ మేట్ .. రవి తమ్ముడు సుధాకర్ .. మాకంటే రెండేళ్ళు చిన్నవాడు .. వాళ్ళ బాబాయి సత్తిబాబు, అందరం కలిసి రేకపల్లి నుంచి వెళ్ళేవాళ్ళం. రేకపల్లి నుండి వరరామచంద్రపురం (విఆర్ పురం అని కూడా అనేవాళ్ళం) లోని మా స్కూలు రెండు కిలోమీటర్లు ఉండేది. ఈ రెండు ఊళ్లకీ మధ్య ఓ చెరువూ, ఆ చెరువు గట్టుమీద ఓ మామిడి చెట్టూ, ఆ చెట్టు కింద నీడలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాలూ ఉండేవి. నాకు భక్తి కాస్త తక్కువే. కానీ, సత్తిబాబూ, రవీ, సుధాకర్ లకి భక్తి ఎక్కువగానే ఉండేది. అందుకని వాళ్ళు ప్రతీరోజూ బడికి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ తప్పనిసరిగా అమ్మవారికి దణ్ణం పెట్టుకునేవాళ్ళు. భక్తి మాటెలా ఉన్నా, వాళ్ళతోపాటే నేనుకూడా దణ్ణం పెట్టుకునేవాణ్ని. పరిక్షల సమయాల్లో ఈ భక్తి కాస్త ఎక్కువగా ఉండేది.  మామూలు రోజుల్లో శనివారం నాడే కొట్టే కొబ్బరికాయ పరిక్షల్లో రోజూ కొట్టేవాళ్ళు. 

రవి అసలు పేరు మాదిరెడ్డి సూర్యనారాయణ. బాగా చదివేవాడు. చాలా సున్నిత మనస్కుడు. తనకు ఏ సబ్జెక్టు లోనైనా తను అనుకున్నదానికంటే తక్కువ మార్కులు వచ్చాయంటే మొహం ఎర్రబడిపోయి కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసేవి. ఎవరైనా ఏమైనా అన్నాకూడా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసేవి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా  ఎర్రుపాలెం మండలం మామునూరు హైస్కూల్ హెడ్ మాస్టారుగా పనిచేస్తున్నాడు.  అంత సున్నితమైన మనసు కలవాడు ఓ హైస్కూల్ ని నిర్వహించడమంటే మామూలు విషయం కాదు.

ఇంకా మా క్లాస్ మేట్లలో సత్తిపండు అని స్టోరు గుమస్తా గారి తమ్ముడు. ఏడో తరగతి నుండి మాతో కలిసాడు. అసలుపేరు పెంజర్ల త్రినాధ వీర వెంకట సత్యనారాయణ. వాడు తనపేరు పెద్దదని బడాయి పోయేవాడు. చాలదన్నట్లు గొప్పగా తన అసలు పేరు పెంజర్ల త్రినాధ వీర వెంకట బ్రహ్మ విష్ణు మహేశ్వర సత్యనారాయణ అనీ, పెద్దదని పిలవడం కష్టం అవుతుందని తనపేరు సగమే రాయించారని చెపుతూ ఉండేవాడు. మేం మాత్రం వాడిని పీటీవీవీ అని షార్ట్ కట్లో పిలిచేవాళ్ళం. వాడు నల్లగా ఉండేవాడు. అందుకని వాడిని ఏడిపించేటప్పుడు సత్తిపండూ, చింతపండూ అని పిలిచేవాళ్ళం. మా అందర్లోకీ ముందుగా ఉద్యోగం సంపాదించింది వాడే. ఇంటర్ కాగానే చిన్నదో పెద్దదో సూపర్ బజార్ లో ఉద్యోగం సంపాదించాడు. అప్పటి నుండీ ఖాళీ లేకుండా ఏదో పని చేస్తూనే ఉండేవాడు. మా అందరికంటే ముందే భద్రాచలంలో ఇల్లు కూడా కట్టుకున్నాడు. ప్రస్తుతం తణుకులో తనే స్వయంగా సూపర్ బజార్ పెట్టాడు.
ఇంకో క్లాస్ మేట్ గుండుపూడి భాస్కర్ రావు. పీటీవీవీతో ఎప్పుడూ గొడవ పడేవాడు వీడు. వీళ్ళకి హోటల్ ఉండేది. హోటల్లో టిఫిన్లూ అవీ బాగానే తిన్నా, బక్కగా ఉండేవాడు. అందరం వీడిని బక్కోడా అనేవాళ్ళం. వీడికి డాన్సుల పిచ్చి. అక్కినేని నాగేశ్వర రావులాగా పోజులు కొడుతూ ఉండే వాడు. ఓసారి కబాడీ ఆడుతుంటే ముక్కుకు దెబ్బ తగిలి ముక్కు రూపం కాస్త మారింది. అప్పట్నుంచీ  పీటీవీవీ వాడిని ముక్కొంకరోడా అని పిలిచేవాడు. ఇద్దరికీ క్షణం పాడేది కాదు. అయినా ఇద్దర్నీ ఎప్పుడూ విడి విడి గా చూడలేదు మేం. ఎప్పుడూ కొట్టుకుంటూనే కలిసి వుండేవాళ్ళు.  ఇప్పటికీ అంతే.
వీళ్ళకి తోడు ములకల అశోకు .. వీడు నాకంటే సంవత్సరం చిన్నవాడు. కానీ మా క్లాసే చదువుతుండేవాడు. పదో తరగతి పరీక్షలప్పుడు వయసు తక్కువయిందని డాక్టరు సర్టిఫికేట్ తెచ్చుకో మన్నారు. వాళ్లకి కిరాణా షాపు ఉండేది. తల ఎప్పుడూ నూనె కారుతూ ఉండేది. గమ్మత్తుగా ఫంకు వచ్చేలా దువ్వుకునేవాడు. ఓ పిచ్చుక దాక్కో గలిగేలా ఉండేదా ఫంకు. రాత వాడి కళ్ళల్లాగానే పెద్దగా గుండ్రంగా ఉండేది. పీటీవీవీ, గుండుపూడి, అశోకు పక్క పక్క ఇళ్లల్లోనే ఉండేవాళ్ళు. అందుకని ముగ్గురూ ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. అశోకు’ప్రస్తుతం విఆర్ పురం లోనే  ఓ కిరాణా షాపు నడుపుతున్నాడు. మా అందర్లోకీ మా ఊళ్ళోనే స్థిరపడి ఉన్నది వాడే. 
మా క్లాస్ మేట్ లలో రవిలాగా బాగా చదివేవాడు  వేమన సూర్య ప్రకాశరావు .. వీళ్ళకి కూడా కిరాణా షాపు ఉండేది. రాత చాలా బాగుండేది. సైన్స్ బొమ్మలు, మ్యాపులు కూడా బాగా వేసేవాడు. కొద్దిగా సిగ్గరి. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ప్రస్తుతం జాంపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో ఆఫీసరుగా చేస్తున్నాడు.
ఇంక పండా రాముడు, బీరబోయిన కన్నారావూ, సవలం సుబ్బయ్య .. వీళ్ళు ముగ్గురూ హాస్టల్ లో ఉండి చదివేవాళ్ళు. ముగ్గురూ గిరిజన కుటుంబాలకు చెందినవాళ్ళు. 
పండా రాముడు నల్లగా, బలంగా ఉండేవాడు. మా ఊరికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలోని పెదమట్టపల్లి అనే ఓ గిరిజన గ్రామం వాళ్ళ స్వంత ఊరు. చింత, మామిడి, ఇప్ప చెట్లతో నిండి ఉండేది ఆ ఊరు. తాటి చెట్లుకూడా బాగా ఉండేవి.  గిరిజన గ్రామమనీ, అడవిలో ఉందనేగానీ, చాలా బావుండేది వాళ్ళ ఊరు. హాస్టల్లో ఉంటూ ఆరో తరగతి నుండీ మాతో పాటే చదివాడు. కబడ్డీ బాగా ఆడేవాడు. చేతి రాత గుండ్రంగా ఉండేది. ప్రతీ విషయాన్నీ బాగా గుర్తు పెట్టుకునే వాడు. తర్వాత్తర్వాత ఉస్మానియా యునివర్సిటీ లో పీజీ చేసి హైదరాబాద్ లోనే ఉద్యోగం సంపాదించి శ్రీకాకుళం జిల్లాలో ముఖ్య ప్రణాళికాధికారి గా పని చేస్తూ ఈ మధ్యనే (మే 2012) అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి పెట్టి ఏదో పనున్నట్టు వెళ్ళిపోయాడు.
ఇంక బీరబోయిన కన్నారావు .. వీళ్ళ ఊరు మా ఊరికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రామవరం. శబరి నదిలో కలిసే సోకిలేరు అనే వాగు వడ్డునే ఉంటుంది. ఇది కూడా గిరిజన గ్రామమే. ఏడవ తరగతి వరకూ చింతూరు హాస్టల్లో చదువుకుని ఎనిమిదవ తరగతి నుండీ మాతో కలిసి చదివాడు. బాగా చదివేవాడు. చక్కని చేతిరాత అతని సొంతం. చక్కగా బొమ్మలు వేసేవాడు. నా చేతి రాత బాగుపడిందంటే, నేను బొమ్మలు వేయడం మొదలు పెట్టానంటే అతన్ని చూసే. తను కూడా ఉస్మానియా యునివర్సిటీలో సీటు సంపాదించి హైదరాబాదులోనే ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం ప్రభుత్వ బీమా సంస్థలో రీజనల్ డైరెక్టరుగా విశాఖపట్నంలోఉద్యోగం చేస్తున్నాడు.
ఇంకా సవలం సుబ్బయ్య .. తనుకూడా కన్నారావు వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఉన్న చూటూరు అనే ఊరికి చెందినవాడు. తనూ, కన్నారావూ కూడా చింతూరు హాస్టల్లోనే చదివారు.ఎనిమిదో తరగతి నుండీ మాతో కలిసి చడువాడు. వీళ్ళు ముగ్గురూ ఇంటర్మీడియట్ నాతొ భద్రాచలం జూనియర్ కాలేజీలో చదివారు. సుబ్బయ్య మాత్రం ఇంటర్మీడియేట్ తో ఆపేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత కొద్దిరోజులు ఏదో  స్వచ్చంద సంస్థలో పనిచేసాడు. అనంతరం ఐటిడిఏ వారిచ్చిన అవకాశంతో వాళ్ళ ఊరికి దగ్గరిలోని ఒక ఊళ్ళో టీచరు గా ఉద్యోగం చేస్తున్నాడు. 

ఇంక అమ్మాయిల విషయానికొస్తే మా క్లాసులో ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఎనుముల రాజేశ్వరి - రేకపల్లిలోనే వాళ్ళిల్లు. మేము బయలుదేరే సమయానికే తనూ బయలుదేరేది. ఇంకా మా ఊళ్లోని ఇతర ఆడపిల్లలతో కలిసి మా వెనకాలే వచ్చేది. బాగానే చదివేది. నోటిలో నుంచి మాట  పెగిలేది కాదు. ఇంకో అమ్మాయి మట్టా అమ్మాజీ. వాళ్ళ నాన్నగారు టీచరుగా పనిచేసేవారు. వాళ్ళు రేకపల్లికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఉమ్మడివరం అనే గిరిజన గ్రామంలో ఉండేవాళ్ళు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారు చిన్న సైకిల్ కొనిచ్చారు. ఆ ఊరినించి ఒక్కతే సైకిల్ పై వచ్చేది. చాలా ధైర్యంగా ఉండేది. ఈ అమ్మాయి గొంతు కూడా సన్నగానే ఉండేది.  మూడే అమ్మాయి పేరు అన్నంరాజు విజయలక్ష్మి వడ్డిగూడెం నుండి వచ్చేది. ఈ ఆమ్మాయి గొంతు కాస్త బొంగురుగాఉండి  కాస్త గంభీరంగా ఉండేది. మిగతా ఇద్దరికంటే కాస్త గట్టిగా వినిపించేది.   వీళ్ళ గొంతు గురించి ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నానంటే వాళ్ళ ముగ్గురి గొంతులూ కూడా క్లాసులో ఎక్కువగా వినిపించేవి కావు.  మా హిందీ మాస్టారు పాపయ్య శాస్త్రి గారు వాళ్ళ ముగ్గురి గొంతులనూ విన్నతర్వాత  వాళ్లకి గొంతు కాస్త గట్టిగా వినిపించే విజయలక్ష్మికి "నీరసం" అనీ, కాస్త బాగా వినిపించే అమ్మాజీకి "అతినీరసం" అనీ, మాట అసలు వినిపించని రాజేశ్వరికి "మహానీరసం" అనీ పేర్లు పెట్టేశారు.  ఒకసారి పాటలపోటీలో విజయలక్ష్మి భానుమతి పాడిన "శరణం .. నీదివ్య శరణం..." పాటని పాడింది. అప్పటినుండీ ఆ అమ్మాయిని అందరూ "శరణం.." అనే పిలిచేవాళ్ళు.  కానీ ఆ అమ్మాయి తనని ఏడిపించే వాళ్ళందరికీ బాగానే సమాధానం చెప్పేది.  

వీళ్ళతో పాటు మాకంటే ముందు సంవత్సరం పదో తరగతి చదివిన ముగ్గురు .. మాదిరెడ్డి సత్యనారాయణా, జవ్వాది రామకృష్ణా, మల్లాది రాజేంద్ర ప్రసాదూ, బీరబోయిన వీర్రాజూ కూడా మాతో కలిసి చదివారు. అప్పట్లో ఎవరైనా పదో తరగతి తప్పితే మళ్ళీ సంవత్సరమంతా చదవాల్సి వచ్చేది. కంపార్టుమెంటల్ పద్ధతి లేదు.  దాంతో చాలామంది అక్కడితో చదువు ఆపేసేవాళ్ళు. కానీ వీళ్ళు నలుగురూ చదువు ఆపెయకుండా  మళ్ళీ చదివారు. బాధాకరమైన విషయమేమిటంటే వీళ్ళల్లో జవ్వాది రామకృష్ణా, మల్లాది రాజేంద్ర ప్రసాదూ మనమధ్యలేరు. కారణాలేవయితేనేమి.... చాలా చిన్న వయసులోనే ఈలోకం విడిచి వెళ్ళిపోయారు. మాదిరెడ్డి సత్యనారాయణ ..
అందరం అతన్ని సత్తిబాబు అని పిలిచేవాళ్ళం... తుపాకి పట్టుకుని వేటకి వెళ్ళేవాళ్ళం. చెరువులో చేపలు పట్టేవాళ్ళం. దీపావళి పండక్కి జువ్వలూ, సిసింద్రీలూ, మతాబులూ చేసేవాళ్ళం. మేమిద్దరం చాలా చాలా ఎంజాయ్ చేశాం. తర్వాత ఐటిఐ చదివి రేకపల్లిలోనే రైసు మిల్లూ, కిరాణా షాపూ, ఫోటో స్టుడియో వగైరాలు చాలా నడిపి ప్రస్తుతం పాపికొండలు పర్యాటకంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాడు. రాజకీయంగా కూడా బాగానే పలుకుబడి గడించాడు.  బీరబోయిన వీర్రాజు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ ఊళ్లోనే ఉంటున్నాడు.
మేమందరం  ఒకసారి కలుసుకుని పూర్వ విద్యార్ధుల సమ్మేళనం నిర్వహించి అప్పుడు మాకు చదువులు చెప్పిన గురువుల్ని సన్మానించాలి అని అనుకున్నాం.  ఆ వివరాలు నా తరవాతి పోస్ట్ లో చెబుతాను. ఇప్పటికి ఈ పోస్టు ఇక్కడితో ఆపేస్తాను. సరేనా?

23, అక్టోబర్ 2012, మంగళవారం

గుర్తున్నాయా నేస్తం..



గుర్తున్నాయా నేస్తం....


తెచ్చుకున్న మామిడి కాయా..
మేస్టారేసిన మొట్టికాయా..
పొట్లంలో ఉప్పూ కారం..
మిత్రునితో పంచుకున్న మమకారం..                        గుర్తున్నాయా...

తలపై దువ్విన ఫంకూ..
జేబులో పెన్ను కక్కిన ఇంకూ...
ములికిరిగిన పెన్సిలూ...
చెక్కుతుంటే తెగిన వేలూ..                                     గుర్తున్నాయా...

క్లాసులో పాఠాలు వింటుంటే  
ముసురుకున్న మబ్బులూ,...
మబ్బుల్లో ఎగురుతున్న కొంగల బారులూ...
ఈదురుగాలికి తలలూపే చెట్లూ...                              గుర్తున్నాయా

తటిల్లున మెరుపులు మెరిస్తే
ఫెళ్ళున ఉరిమితే ..
బిత్తరపోయి ఉలిక్కిపడ్డ నేస్తాలు
పకపక నవ్విన మేష్టార్ల నవ్వులు...                           గుర్తున్నాయా

జోరున కురిసిన వానకు చూరునుంచి కారిన ధారలు
గుమ్మం ముందునుంచి పారిన కాల్వలు
కాల్వల్లో వదిలిన కాగితం పడవలు
పుస్తకం చించినందుకు నేస్తంతో గొడవలు...                  గుర్తున్నాయా