పోయినసారి నా మిత్రుల గురించి చెప్పాను.
మేమందరం ఓసారి
కలుసుకుందామని అనుకుంటున్నట్లూ, మాకు చదువు చెప్పిన గురువుల్ని సత్కరించాలని
అనుకుంటున్నట్లూ చెప్పాను కదా..
మా బాచ్ లో అమ్మాయిలు తప్ప
మిగిలిన అందరం ఎప్పుడో ఓసారి కలుసుకుంటూనే ఉన్నాం. కన్నారావు, రాముడూ తరచుగా ఫోన్
చేసేవాళ్ళు. రవి ఇక్కడే ఖమ్మంలో
ఉంటున్నాడు కనుక అప్పుడప్పుడూ కలుసుకుంటూనే ఉంటాం. భాస్కర్రావు చర్ల లో ఉంటాడు.
ఎప్పుడైనా ఖమ్మం వస్తే నన్ను కలిసేవాడు. నేనూ అప్పుడప్పుడూ ఫోన్ చేస్తుండేవాడిని.
అశోక్ వి.ఆర్.పురం లోనే ఉంటున్నాడు కనుక అక్కడికి వెళ్తే వాడూ కలిసేవాడు. ఇంక నాకు
కలవని వాళ్ళు ప్రకాష్, సుబ్బారావూనూ.
ప్రకాష్ రాజమండ్రీలో
ఉంటున్నట్లు, ఆర్యాపురం కోపరేటివ్ బాంకులో పనిచేస్తున్నట్లూ తెలుసు కానీ,
వెళ్ళలేదు, కలవలేదు. రాజమండ్రీలో ఎక్కడ
ఉంటున్నదీ తెలియదు. నేను రాజమండ్రీ వెళ్ళేదే తక్కువ. బంధువుల ఇళ్ళల్లో’
పెళ్ళిళ్ళకు అటువైపు వెళ్ళినా రాజమండ్రీలో ఆగడం కుదరలేదు. కానీ ఎలాగైనా కలవాలనే
కోరిక నాలో బలంగానే ఉంది. ఆమధ్య ఓసారి
కొవ్వూరులో ఓ బంధువు ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి పిలిస్తే వెళ్లాను.
తిరిగి వెనక్కి రావడానికి బస్సుకి చాలా సమయం ఉందంటే నా పాత మిత్రుడిని కలవడానికి ఇదే మంచి అవకాశమని ఓసారి రాజమండ్రీ వెళ్లి వస్తానని
మావాళ్ళకి చెప్పి బస్సెక్కాను. రాజమండ్రీలో బస్సు దిగి ఆటోలో జాంపేట వెళ్లాను.
ఆర్యాపురం కోపరేటివ్ బ్యాంక్ ఎక్కడో తెలుసుకుని అక్కడికి వెళ్లాను. ప్రకాష్
గురించి బ్యాంక్ వాచ్ మాన్ ను అడిగాను. లోపలే ఉన్నారని చెప్పాడు. ఆతృతగా లోపలికి
వెళ్లి చూసాను గుర్తుపట్టగలనో లేదో అనుకుంటూ.. సీట్లో తలొంచుకుని పనిచేసుకుంటూ కూర్చున్న
వ్యక్తిని చూసాను. తనేనా..కాదా? అనుకుంటూ చూస్తున్నాను. తనే! అప్పటి పోలికలు ఉన్నా
చాలా మార్పు కనిపిస్తోంది. బట్ట తల వచ్చేసింది. నన్ను గుర్తుపట్టగలడా.. అనుకుంటూ
తననే చూస్తూ నిల్చున్నాను. చేతిలో పని
అయిపోయాకా తల పైకెత్తి ఏమి కావాలన్నట్లు చూసాడు. “ప్రకాష్ మీరేనా..?” అని అడిగాను.
“నేనే.. ఏంకావాలి?..” అంటూ నాకేసి చూసి ఒక్క క్షణం ఆగి పోయాడు. “మీరు.. మీరు..”
అంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆగిపోయాడు. నేనెవరో చెప్పాను.
అతని మోహంలో ఆశ్చర్యంతో కూడిన ఆనందం.. లోపలి పిలిచి కూర్చోబెట్టి ప్రశ్నలతో
ముంచేశాడు. ఎన్నాళ్ళయిందో.. చూసి. పదో తరగతి తర్వాత ఇదే తనని చూడడం. ముప్ఫై మూడేళ్ళు అవుతోంది సుమారుగా.. అన్ని
ప్రశ్నలు వేసినా నేనొకటి గమనించాను. తనలో అప్పటి మొహమాటం, రిజర్వుడు గా ఉండే
తత్వమూ ఏమీ మారలేదు. కాసేపు మాట్లాడుకున్న
తర్వాత వచ్చేశాను. భోజనానికి ఉండమన్నాడుకానీ వచ్చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడూ
ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం.
నేను ఇంటర్ అయిపోయిన తర్వాత
అస్సలు కలుసుకోనిది సుబ్బారావునే. ఇంటర్ అయిపోగానే రాముడూ, కన్నారావూ పై చదువుల
కోసం వెళ్ళిపోయినా, సుబ్బారావు మాత్రం వాళ్ళ ఊళ్లోనే ఉండిపోయి వ్యవసాయం చేసుకుంటూ
అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత భద్రాచలం బస్టాండులో కన్నారావు
కలిసినప్పుడు సుబ్బారావు గురించి అడిగితె తనేదో స్వచ్చంద సంస్థలో పని
చేస్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత కొన్ని
రోజుల తర్వాత ఐటిడిఏ స్కూల్లో పని చేస్తున్నట్లుగా తెలిసింది.
వీళ్ళుగాక మాతో కలిసి
చదువుకున్న మరో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు పదోతరగతి వరకూ మాతో కలిసి ఆ
బళ్ళో చదువుకోలేదు గానీ, ఉన్నంత వరకూ మాతో కలిసిపోయి మేము విడిపోయినా మేము మరచిపోలేని
వాళ్ళు.
వాళ్ళల్లో కొంపెల్ల
రామ్మూర్తి ఒకడు. డిప్యుటీ స్కూల్స్ ఇన్స్పెక్టరు గారు విశ్వనాధం గారి పెద్దబ్బాయి.
ఆరు ఏడు తరగతుల వరకూ మాతోనే కలిసి చదివినా ఉపనయనం కోసం వాళ్ళ ఊరు వెళ్లి అక్కడే
ఉండిపోయాడు. ఓ సంవత్సరం చదువు ఆగిపోయింది. అక్కడే స్కూల్లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ మేం
పదో తరగతిలోకి వచ్చాక మళ్ళీ ఇక్కడికి వచ్చి తొమ్మిదో తరగతిలో చేరాడు. కొంపెల్ల
రామ్మూర్తి కాదు వాడు. కోతి రామ్మూర్తి అనేవాళ్ళు అందరూ. నిజంగా వాడు కోతే! బాగా
అల్లరి చేసేవాడు.
కావూరు పాపయ్య గారని హిందీ
మేష్టారు ఉండేవారు. ఆయన తమ్ముడు
గోపీకృష్ణ. ఎనిమిదో తరగతిలో మాతో కలిశాడు. తొమ్మిది వరకూ చదివి మళ్ళీ వాళ్ళ
సొంతూరికి వెళ్ళిపోయాడు. చాలా చలాకీగా ఉండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు.
ఇంక నాగు. అనప్పిండి వెంకట
నాగేంద్ర కుమార్ పూర్తి పేరు. మాకు స్కూల్లో హిందీ, లెక్కలు చెప్పిన శర్మ మేస్టారి
తమ్ముడు. వాళ్ళ అన్నదమ్ములందరూ ఉపాధ్యాయ
వృత్తిలోనే ఉన్నారు. ఆమాటకొస్తే వాళ్ళ
కుటుంబం అంతా ఉపాధ్యాయులే. వాళ్ళ కుటుంబం గురించి మరోసారి చెప్పుకుందాం. అందర్లోకీ
నాగూనే చిన్నవాడు. ఒకటో తరగతి నుండీ ఆరో తరగతి వరకూ మాతో కలిసి చదివాడు. బాగా
చదివేవాడు. ప్రతీదానికీ అందరితో పోటీ పడేవాడు. అతని ఆఖరు అన్నయ్యకి – సుబ్బు అనేవాళ్ళం
– తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం దగ్గర ఉద్యోగం వస్తే అతని దగ్గరికి వెళ్ళిపోయి
అక్కడ ఉండి చదువుకొన్నాడు. ఎనిమిదో తరగతిలో వచ్చి మాతో చదివాడు. మళ్ళీ తొమ్మిదో
తరగతిలో వాళ్ళ అన్నయ్య దగ్గరకి వెళ్ళిపోయాడు. ఇంక ఆతర్వాత మాతో కలవలేదు. ఆ తర్వాత ఎప్పుడో ఆయనకీ బ్యాంకులో ఉద్యోగం
వచ్చాక కలిశాడు.
నాలుగోవాడు బెహరా
రామకృష్ణ. మా తెలుగు మాస్టారు ఎర్రాప్రగడ
రామ్మూర్తి గారి బంధువులబ్బాయి. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట దగ్గర వాళ్ళ ఊరు.
అక్కడ అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడని ఇక్కడికి తీసుకు వచ్చారాయన. పదో తరగతిలో
చేరాడు. వయసుపరంగా మాకంటే పెద్దవాడే. తెగ కబుర్లు చెప్పేవాడు. బాగా కోతలు
కోసేవాడు. పదో తరగతి పరిక్షలు రాయకుండానే వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. కానీ మాకందరికీ
బాగా గుర్తుండిపోయాడు.
వీళ్ళేగాక విశ్వేశ్వర రావు
అనే మరో మిత్రుడు ఆరు ఏడు తరగతులు మాతో కలిసి చదివాడు. మాకు సాంఘికశాస్త్రం
చెప్పిన డేవిడ్ మాష్టారి బంధువు. బాగా అల్లరి చేసేవాడు. ఆ తర్వాత ఎక్కడున్నాడో ఏం
చేస్తున్నాడో మాకు తెలీలేదు.
ఇంక అమ్మాయిల విషయానికొస్తే
అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడడం అంటే మాకు బెరుకు. ఏదో స్కూల్లో ఉన్నప్పుడే కాస్త
మాట్లాడుకోవడం. లేకపొతే అదీ లేదు. పదో తరగతి తర్వాత ఎవరు ఎక్కడున్నారో తెలీదు. రాజేశ్వరి
మా ఊరే కాబట్టి పెళ్ళయిన సంగతి తెలుసు. తర్వాత తిరుపతి వెళ్ళిపోయింది. మిగిలిన
ఇద్దరూ.. అమ్మాజీ, విజయలక్ష్మీ.. ఎక్కడున్నారో... ఓసారి బస్సులో అమ్మాజీ కలిసింది.
కూనవరంలో బస్సెక్కింది. అవునా కాదా అంటూనే పలకరించాను. తనే.. హైదరాబాదులో
ఉంటున్నట్టు చెప్పింది. వాళ్ళాయన భూగర్భజల శాఖలో పనిచేస్తున్నట్లు చెప్పింది.
అంతే. ఫోన్ నెంబరు అడగడానికి మొహమాటం వేసి అడగలేదు. ఆతర్వాత తన వివరాలు తెలీలేదు. విజయలక్ష్మిని
పదో తరగతి తర్వాత అసలు చూడనేలేదు.. ఎక్కడుందో తెలీదు.
వీళ్ళే గాక ఇంకా రాజాగారి
అమ్మాయి వెంకాయమ్మా, ఈవో గారమ్మాయి సుబ్బలక్ష్మీ, గొల్లకోటి విజయలక్ష్మీ ఇంకా జ్యోత్స్నా కూడా మాతో చదివారు. వాళ్ళు ఎక్కడున్నారో ఏమో.
గొల్లకోటి విజయలక్ష్మి.. తనుమాత్రం
మధ్యలో కలిసేది. వాళ్ళ తాతగారూ, మా నాన్నగారూ మంచి స్నేహితులు. వాళ్ళ నాన్నగారు
గొల్లకోటి రామకృష్ణ గారు రెవెన్యు డిపార్టుమెంటులో పని చేసేవారు. ఆ తర్వాత తనకి పెళ్ళైపోయి తూర్పుగోదావరి జిల్లా
గొల్లప్రోలు దగ్గర భోగాపురం వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళాయనకి భద్రాచలం పేపర్ బోర్డులో ఉద్యోగం వచ్చింది. పేపరుబోర్డు
కాలనీకి ఎప్పుడైనా వెళ్తే వీలు చూసుకుని వాళ్ళింటికి వెళ్తుండే వాడిని. ఈమధ్య
వాళ్ళాయన వీ ఆర్ ఎస్ తీసుకుని ఇక్కడినుండి వెళ్లిపోయాడని తెలిసింది. ఇప్పుడు
ఎక్కడుందో మరి.
ఈసారి ఎలాగైనా అందరం
కలుసుకోవాలి. కన్నారావుతో అన్నాను. రాముడితో కూడా అన్నాను. భాస్కర్రావుకూడా
కలుసుకుందాం అన్నాడు. ఎక్కడో ఒకచోట కలుసుకోవాలి. ఎలా...
ఆ తర్వాత ఇంటర్
చదవడానికి తలోచోటికీ వెళ్లిపోయాము. అప్పుడు విడిపోయాము. మళ్ళీ ఎప్పటికైనా
కలుస్తామో లేదో అనుకున్నాం.
మా అమ్మాయి పెళ్ళికి
అందర్నీ పిలవాలని నిర్ణయించుకున్నాను.
అందరి ఫోన్లూ సంపాదించి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి పిలిచాను. అందరికీ
శుభలేఖలు పంపించాను. పెళ్ళికి కన్నారావూ, రాముడూ, పీటీవీవీ, భాస్కర్రావూ, రవీ,
కొంపెల్ల రామ్మూర్తీ వచ్చారు. అమ్మాయి పెళ్లి అనేది ఒక పండగ లా అనిపిస్తే మేమందరం
కలుసుకోవడం మరో పండగలా అనిపించింది. అందరూ
మమ్మల్ని చూసి ముచ్చట పడ్డారు. అందరం
ఎక్కువసేపు మాట్లాడుకోలేక పోయినా అందరం ఒకచోట కలుసుకోవడం మాకే గాక మా బంధువులందరికీ కూడా సంతోషం
కలిగించింది.
ఈ సంతోషాన్ని మరింత పెంచు కోవాలంటే పెళ్ళిలో గాకుండా విడిగా అందరం కలుసుకోవాలి. ఎలా...
...
మనం కూడా మరోసారి కలుసుకుందాం..
2 కామెంట్‌లు:
Sir, It was always a great feeling/ reading about old friends and childhood things. Nicely written by you. We are also experiencing the same feelings when we met after 20 yrs (almost we could gather 86 old pals) With Best regards, K.Srinivas, Kolkata
పాత స్నేహితుల గురించి చెప్పుకోవడంలో ఆనందమేవేరండి. బాగుంది!
కామెంట్‌ను పోస్ట్ చేయండి