10, నవంబర్ 2012, శనివారం

స్నేహితుడా .. నీకు వీడుకోలు...



స్నేహితుడా.. వీడ్కోలు..

జీవితం సుఖ దు:ఖాలమయం.  కష్టసుఖాల సమ్మేళనం. 
ఏదీ మనని అడిగి రాదు.  ఏదీ మనకోసం ఆగదు.
జీవితం అంటే ఈ లోకానికి కన్ను తెరచి కన్ను మూసే మధ్యలో గడిచే లిప్త కాలంపాటు నడిచేకాలం.
మనం రావడం నుంచి మనం నిష్క్రమించడం వరకూ ... ప్రపంచ రంగస్థలంపై నడిచే  ఓ గొప్ప నాటకం ...
ఈ నాటకంలో ఏ అంకం ఎప్పుడు మొదలవుతుందో .. ఎప్పుడు అంతమవుతుందో... ఎవరూహించగలరు?
అయితే జరిగే ప్రతీ ముగింపుకూడా  మరో  ప్రారంభమే! 

ఏమిటీ ... ఈ వేదాంతం? ఏమిటీ ... ఈ నైరాశ్యం?

అంతే! మనం ఊహించని సంఘటనలు జరిగినపుడూ...  ఆ సంఘటనలు మనల్ని కదిలించివేసినప్పుడూ ...  మన గుండెల్లోంచి వచ్చే ఆ మాటల వెనుక ఉండే బరువు వేదాంతమే.. ఆ మాటల్లో వినిపించేది నైరాశ్యమే...
***
మే 31, 2012.. ఉదయాన్నే పేపరు చూస్తున్నాను.   
జిల్లా పేజీ చదువుతుంటే ఓ వార్త నన్ను ఉలిక్కి పడేలా చేసింది. 
శ్రీకాకుళం జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి గా పనిచేస్తున్న నా మిత్రుడు పండా రాముడు హఠాత్తుగా మరణించిన వార్త అది...
తను ముందురోజే అంటే 30 తేదీనే చనిపోతే  వెంటనే వాళ్ళ ఊరి తీసుకు వచ్చేసారు.
నేను ఒక్క సారిగా షాక్ అయ్యాను. వెంటనే రవికి ఫోన్ చేసాను.తనుకూడా అప్పుడే చూసాడట. 
వెంటనే వెళ్లి చూద్దాం అనుకున్నాము కానీ... ఆరోజు భారత్ బంద్! వెళ్ళ లేక పోయాము. 
తను పోయినందుకు బాధ కొంత అయితే చివరి చూపులకు వెళ్ళలేక పోయినందుకు మరికొంత బాధ...
బరువెక్కిన  గుండెతో నీలిమకి ఫోన్ చేసాను.
రాముడు చిన్నకూతురు నీలిమ .. రాముడు ఫోన్ చేసినప్పుడల్లా తనతో మాట్లాడించేవాడు. 
తనకి ఫోన్ చేసి నా సంతాపాన్ని తెలియజేశాను. పెద్ద కర్మ ఎప్పుడో తెలియజేస్తే వస్తానని చెప్పాను.
ఆ తర్వాత కన్నారావు కూడా ఫోన్  చేసి మాట్లాడాడు. 
రాముడుకి ముందురోజు రాత్రి 29న రాత్రి గుండెల్లో కొద్దిగా నొప్పి అనిపించిందట. ఏదో మందు వేసుకుని పడుకున్నాదట. ఉదయాన్నే హాస్పిటల్ కి వెళ్లాలనుకున్నారట. సుమారు 11 గంటల సమయంలో హాస్పిటల్ కి వెళ్తుంటే మళ్ళీ గుండెపోటు వచ్చిందట. హాస్పిటల్లో డాక్టరు పరీక్ష చేస్తుండగానే ప్రాణం పోయిందట.
విషయం తెలియగానే కలెక్టరు గారూ, ఇంకా మిగిలిన జిల్లా అధికారులంతా వచ్చి చూసి  భార్యాపిల్లల కోరిక మీద వెంటనే అంబులెన్స్ ఏర్పాటుచేసి వాళ్ళూరు పంపించారట. అప్పుడే తనకీ ఫోన్ చేసారట. ఈ విషయాలన్నీ కన్నారావు చెప్పాడు.   
తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత నీలిమ ఫోన్ చేసి పెద్ద కర్మ జూన్ 20 తేదీన పెద్దకర్మ వచ్చిందని చెప్పింది.
మా మిత్రులందరం ఆరోజు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. 
***
జూన్ 20 .. రానే వచ్చింది.
ముందే అందరికీ ఫోన్లు చేసాను. రవి వస్తానన్నాడు. అశోక్ అక్కడే ఉన్నాడు. భాస్కర్, పీటీవీవీ కూడా వస్తామన్నారు.
కానీ రవికి స్కూల్లో కుదరలేదు. ఉదయాన్నే  ఖమ్మం నుండి నేను బయలుదేరాను. పీటీవీవీ ముందురోజు రాత్రే  భద్రాచలం వచ్చేసాడు.  భాస్కర్ పొద్దున్నే బయలుదేరి వస్తున్నానని చెప్పాడు. భద్రాచలం చేరాక పీటీవీవీ కి ఫోన్ చేస్తే బస్టాండ్ కి వచ్చేసాడు. భాస్కర్ రాలేదు. వస్తాడో రాడో తెలీదు. నేనూ, పీటీవీవీ ఇద్దరం మళ్ళీ బస్సెక్కాము.
బస్సెక్కిన దగ్గర్నించీ రాముడి గురించే  మాట్లాడుకున్నాం. పీటీవీవీ తనతో రాముడు మాట్లాడిన సంగతులే చెప్పాడు. వి.ఆర్.పురం వెళ్ళే వరకూ తనగురించీ వాళ్ళ పిల్లల గురించే మాట్లాడుకున్నాం.  
పెద్దమ్మాయి బిందు ఎం.సి.ఏ పూర్తి చేసింది. రెండో అమ్మాయి ప్రియాంక బి.టెక్. పూర్తి కావచ్చింది. మూడో అమ్మాయి నీలిమ  ఇంటర్ చదువుతోంది. పిల్లలకి ఏ లోటూ లేకుండా చదువులైతే చెప్పించాడు గానీ, ఆస్తులైతే కూడబెట్ట లేదు.
అలా మాట్లాడుకుంటు ఉండగానే వి.ఆర్.పురం  వచ్చేసింది. అక్కడ అశోక్ కలిశాడు. ముగ్గురం మోటార్ సైకిళ్ళపై పెదమట్టపల్లి వెళ్ళాం. కన్నారావు అక్కడే ఉన్నాడు. మూడు రోజులైందట అక్కడికొచ్చి. రాముడు భార్యనీ, పిల్లల్నీ కలిసి మా సంతాపం తెలియజేశాం.  
రాముడుకు ఈ లోకం నుండి వీడుకోలు చెప్పే తంతు పూర్తయింది. 
తిరిగి రాని లోకాలకు తరలిపోయిన స్నేహితుడా.... 
పైలోకం  నీ కోసం ద్వారాలు తెరచి ఉంచింది... 
స్వాగతం పలుకుతోంది... వెళ్ళిరా... నేస్తమా .. వెళ్ళిరా.. 
నీకిదే మా చివరి వీడుకోలు...
***
ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నుండి కొందరు అధికారులు కూడా వచ్చారు.  తన స్నేహితులు ... మాతో చదువుకున్నవాళ్ళే కాకుండా, తనతో కలిసి పనిచేసిన ఉద్యోగులూ, ఇంకా సన్నిహితులూ ఇతర మిత్రులూ కూడా వచ్చారు.
నేనూ, కన్నారావూ, అశోకూ, పీటీవీవీ.. చాలాసేపు వాడిగురించే మాట్లాడుకున్నాం.
ఆ తర్వాత మా సంభాషణ మేం చదువుకున్న స్కూల్ మీదకీ, మాకు పాఠాలు చెప్పిన గురువులమీదకీ మళ్లింది. ముఖ్యంగా మా జీవితాల్లో ఎంతో మార్పు తీసుకు వచ్చిన గురువుగారు ఎర్రాప్రగడ రామ్మూర్తి గారి మీదకు మళ్లింది. ఆయన మాకు చదువులు చెప్పిన రోజులూ, పరిక్షల ముందు ఆయన ఇంటికి వెళ్లి అక్కడే చదువుకుని పడుకున్న రోజులూ గుర్తు చేసుకున్నాం.
అప్పుడే ఎలాగైనా  మళ్ళీ అందరం కలుసుకోవాలి అనే విషయం మీదకి మళ్లింది. ఎప్పటినుండో వాయిదాలు పడుతూ వస్తున్న ఆ విషయం మళ్ళీ రంగం మీదకి వచ్చింది. అప్పుడే నిర్ణయించేసుకున్నాం... త్వరలోనే కలుసుకోవాలని...
కన్నారావు ప్రోగ్రాం డిసైడ్ చేసేసాడు. సెప్టెంబర్ 5.. గురుపూజోత్సవం... ఆరోజే చేసేద్దాం.. అన్నాడు.
కానీ, రవీ, మా ఆవిడా టీచర్లు.. వాళ్ళు ఆరోజు స్కూల్లో తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఆ తరువాత వచ్చే ఆదివారం అంటే సెప్టెంబరు 9 నాడు ఆ కార్యక్రమం జరపాలని నిర్ణయించాము.
ఎప్పుడో 1974 లో విడిపోయిన మా స్నేహితులందరం కలుసుకోవడం ... మా పునర్మిలనం ఖచ్చితంగా జరగాలని నిర్ణయించేసాము.
అందరికీ చెప్పెయ్యాలి.. కానీ ఎవరు ఎక్కడ ఉన్నారో, ఎవరు  ఏమి చేస్తున్నారో.. అందరికీ  సమాచారం అందేది ఎలా?
ఆ వివరాలు సేకరించే బాధ్యత నామీదే పెట్టారు అందరూ కలిసి.
కార్యక్రమం ఎలా నిర్వహించాలా అని కాసేపు చర్చించుకుని ఎవరిళ్ళకి వాళ్ళం బయలుదేరాం.
....
అందుకే మొదట్లో అన్నాను ..
ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేము...
ఎప్పుడు ఏది ముగిసిపోతుందో..
ఎప్పుడు ఏది మొదలవుతుందో..
ఏ అంతంలో ఏ ఆరంభం ఉందో..
ఏ ముగింపు దేనికి నాంది అవుతుందో..
“ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ...”
మొత్తానికి ఒకటి స్పష్టమైంది. ఎన్నడో విడిపోయిన స్నేహితులందరం త్వరలోనే కలవబోతున్నాం. 
ఆ కార్యక్రమానికి సన్నాహాలు మొదలయ్యాయి. అప్పట్నించీ ఆ కార్యక్రమం గురించే నా ఊహలూ, ఆలోచనలూ..
ఆ సన్నాహాల గురించి తర్వాత పోస్ట్ లో చెబుతాను.

3 కామెంట్‌లు:

ఓలమ్మోలమ్మో చెప్పారు...

అమ్మో ఎంత కట్టమొచ్చీసింది...
మీ నేస్తం చనిపోయినందుకు నా సానుభూతి..

ఈ పోస్ట్ ఈ రోజు రాసి మీ పునర్మినలనం ఏదో అన్నారు సెప్టెంబర్ 9న..అయిపోయిన దానికి బాజాలా వుంది మల్లీ కొత్తగా..

వెంకట్ చెప్పారు...

ఓలమ్మోలమ్మో!బలేగ పట్టీసినారే! ఇవి గ్నాపకాలు! Making of Old Students Meet! మా పూర్వ విద్యార్ధుల అపూర్వ సమ్మెళనం ఎలా జరిగిందీ అన్న విషయంలొ నా ప్రయత్నాల వివరణ. ఆ ప్రయత్నాల గ్రాంధికీకరణ (documentation)

ఓలమ్మోలమ్మో చెప్పారు...

అలగలాగ..అయితే ఓకే..:-)